Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇంట తీవ్ర విషాదం జరిగిన విషయం విదితమే. ఆ ఇంటి పెద్ద దిక్కు, ప్రభాస్ దైవంలా పూజించే ఆయన పెద్దనాన్న కృష్ణంరాజు కన్నుమూసిన విషయం తెల్సిందే. అశ్రు నయనాల మధ్య ప్రభాస్, ఆయన కుటుంబ సభ్యులు కృష్ణంరాజుకు వీడ్కోలు పలికారు. ఇక కృష్ణంరాజు మృతి ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా మారాడు ప్రభాస్. ముగ్గురు చెల్లెళ్ళను, పెద్దమ్మను ఓదారుస్తూ ఇంటికే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల వరకు షూటింగ్స్ కు బ్రేక్ చెప్పి ఇంటివద్దే ఉంటూ కుటుంబానికి తోడుగా ఉండాలని నిర్ణయించుకున్నాడట. ప్రస్తుతం ప్రభాస్.. పాన్ ఇండియా సినిమాలైనా సలార్, ప్రాజెక్ట్ కె చిత్రాల్లో నటిస్తున్నాడు.
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాలు వచ్చే ఏడాది రిలీజ్ కానున్నాయి. ఇక ఈ నెలలోనే సలార్ భారీ షెడ్యూల్ ఉండనుండగా.. ఇంతలోనే ఈ విషాదం చోటుచేసుకొంది. దీంతో ఈ నెల మొత్తం ప్రభాస్ ఏ షూటింగ్స్ లో పాల్గొననని, అన్నీ క్యాన్సిల్ చేయమని చెప్పినట్లు తెలుస్తోంది. అందుకు దర్శక నిర్మాతలు సైతం ఓకే అన్నట్లు సమాచారం. ఇక అప్పటిలోగా ప్రభాస్ తో కాకుండా వేరే నటీనటులతో షూటింగ్స్ జరగనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల ఎప్పుడు తిరిగి షూటింగ్ లో పాల్గొంటాడో చూడాలి. ఇక ప్రభాస్ నిర్ణయంపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మంచి నిర్ణయం.. కుటుంబం తరువాతే ఏదైనా అని కొందరు.. చెల్లెళ్లకు నువ్వే అండగా ఉండాలి అన్నా అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.
