Prabhas Srinu: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అతిథి సత్కారం గురించి సినీ పరిశ్రమలో తరచూ చర్చ జరుగుతుంటుంది. ఆయన ఇంటికి లేదా షూటింగ్ స్పాట్‌కు వెళ్లిన వారికి రాజమర్యాదలతో భోజనం పెట్టడం, ఎలాంటి లోటు లేకుండా చూసుకోవడం ప్రభాస్ ప్రత్యేకతగా చెప్పుకుంటారు. తాజాగా ప్రముఖ నటుడు ప్రభాస్ శ్రీను ఎన్టీవీ పాడ్‌కాస్ట్‌లో ప్రభాస్ హాస్పిటాలిటీ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభాస్‌తో ప్రతి రోజూ గడిపిన అనుభవమే తనకు ఒక ప్రత్యేక జ్ఞాపకమని ఆయన అన్నారు. ముఖ్యంగా ‘అడివి రాముడు’ సినిమా షూటింగ్ సమయంలో తలకోన అడవిలో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో ప్రభాస్ కఠినమైన డైట్‌లో ఉన్నప్పటికీ, ఒక రోజు షూటింగ్ రద్దు కావడంతో రాత్రి నాటుకోడి తినాలని అనుకున్నారని తెలిపారు.
అయితే అప్పటికే రాత్రి కావడంతో అడవిలో నాటుకోడి దొరకడం అసాధ్యంగా మారిందన్నారు. దీంతో సెట్స్‌లో ఉన్న కోళ్లను టార్చ్‌లైట్‌తో వెతికి పట్టుకుని, వాటితో నాటుకోడి కూర, రసం తయారు చేసి ప్రభాస్‌కు వడ్డించామని చెప్పారు. ఆ రోజు ప్రభాస్ ఎంతో సంతోషంగా భోజనం చేశారని గుర్తు చేసుకున్నారు. ప్రభాస్‌కు అతిథులు అంటే ఎంతో ఇష్టమని, ఎవరు వచ్చినా “ఇది లేదు” అనే మాట వినిపించకుండా చూసుకుంటారని ప్రభాస్ శ్రీను తెలిపారు. అతిథులు తిన్నా తినకపోయినా అన్నీ సిద్ధంగా ఉండాలని ఆయన భావిస్తారని, ఎలాంటి లోటు లేకుండా ఆతిథ్యం ఇవ్వడమే ప్రభాస్ స్వభావమని చెప్పారు. ప్రభాస్ సినిమాల్లో తాను తరచూ కనిపించడం గురించి కూడా ప్రభాస్ శ్రీను స్పందించారు. తనను సినిమాల్లో నటించమని ప్రభాస్ ఎప్పుడూ దర్శకులకు సిఫారసు చేయరని, పూర్తిగా దర్శకులే పాత్రకు తాను సరిపోతానని భావించి ఎంపిక చేస్తారని వెల్లడించారు. “ప్రభాస్ ఎవరినీ రికమెండ్ చేయరు. అది ఆయన స్వభావం. దర్శకులు పాత్రకు నేను సరిపోతానని భావిస్తేనే అవకాశం వస్తుంది” అని స్పష్టం చేశారు.

