దేన్నైనా ఆపొచ్చు కానీ.. అభిమానాన్ని ఆపలేరు.. మరి ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని ఆపడం అనేది ఎవరికి సాధ్యంకానీ పని. తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుంది అనగానే థియేటర్లను ముస్తాబు చేసి, ఫ్లెక్సీలు, కటౌట్ లను ఊరంతా పెట్టి, మొదటి రోజు మొదటి షో కి పూలాభిషేకాలు, పాలాభిషేకాలు అంటూ హడావిడి చేస్తూ అభిమాన హీరో సినిమా విడుదలను పండగలా చేస్తారు. ఇక్కడి వరకు ఓకే.. కానీ అభిమానం హద్దులు దాటి ప్రాణాల మీదకు తెచ్చుకుంటే.. కటౌట్ లు కట్టేటప్పుడు, ఫ్లెక్సీలు పెట్టేటప్పుడు కాలుజారి కిందపడి ప్రాణాలు విడిచిన అభిమానులు ఎంతోమంది ఉన్నారు.. కానీ తాజాగా ఒక అభిమాని తమ హీరో సినిమా ప్లాప్ అయ్యిందని ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు విడిచిన ఘటన కర్నూల్ లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే.. కర్నూలులో ముత్యాల రవితేజ (24) అనే యువకుడు వెల్డింగ్ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో తల్లి ఉషారాణి దినసరి కూలీ చేస్తూ రవితేజను పెంచింది. కాగా రవితేజ చిన్నతనం నుంచి ప్రభాస్ కు వీరాభిమాని. ఎన్నో రోజుల నుంచి వాయిదా పడుతూ వస్తున్నరాధే శ్యామ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన రవితేజ విడుదల రోజునే మిత్రులతో కలిసి సినిమా చూశాడు. అయితే సినిమా మిక్స్డ్ టాక్ రావడంతో రవితేజ తన సన్నిహితులు.. తన తల్లితో కలిసి ఈ విషయంలో మథనపడుతుండేవాడు. ఇక ఈ క్రమంలోనే శనివారం ఇంట్లో ఎవరూలేని సమయంలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయంత్రం ఇంటికి తిరిగొచ్చిన తల్లికి ఫ్యాన్ కు విగతజీవిగా వేలాడుతున్న కొడుకు కనిపించడంతో ఆమె గుండె ముక్కలయింది. హీరోలకు అభిమానులు ఉండొచ్చు కానీ ఇంతటి అభిమానం ఉండకూడదు.. సినిమా ప్లాప్ అయ్యినందుకు రవితేజ ప్రాణాలు తీసుకోవడం చాలా బాధాకరమని అతని స్నేహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. రవితేజ మృతికి సినిమానే కారణమా..? మరింకేదైనా కారణమా..? అనే దిశలో కూడా పోలీసులు విచారిస్తున్నారు.
