మలయాళ సూపర్ స్టార్ ఫహద్ ఫాజిల్ పుట్టిన రోజు ఇవాళ. విశేషం ఏమంటే ఈ యేడాది మల్లూవుడ్ స్టార్ హీరో… ఫహద్ విలన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’లో ఫహద్ విలన్ గా నటిస్తుంటే… అతని భార్య నజ్రియా నజీమ్ ‘అంటే సుందరానికీ’ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రెండు సినిమాలనూ మైత్రీ మూవీ మేకరస్ సంస్థే నిర్మిస్తోంది. ఆదివారం పుట్టిన రోజు జరుపుకుంటున్న ఫహద్ కు మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు శుభాకాంక్షలు తెలియచేస్తూ ఓ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు. చిత్రం ఏమంటే… ఈ పోస్టర్ లో ప్రతినాయకుడు ఫహద్ ఎడమ కన్ను మాత్రమే కనిపిస్తోంది. అయితే ఆ కంటిచూపులోని తీక్షణ మాత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. రెండు భాగాలుగా సాగే ‘పుష్ప’ రాజ్ కథలో ఫహద్ తొలి భాగానికే పరిమితమవుతాడా, రెండు భాగాల్లోనూ ఉంటాడా అనేది తెలియ రాలేదు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ‘పుష్ప’ తొలి భాగం ఈ యేడాది డిసెంబర్ నాలుగో వారంలో క్రిస్మస్ కానుకగా విడుదల కాబోతోంది. ఇందులో రశ్మిక మందణ్ణ హీరోయిన్. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.
ఫహద్ ఫాజిల్ కు ‘పుష్ప’ బృందం బర్త్ డే విషెస్!
