పూజా హెగ్డే… టాలీవుడ్ లో ఇప్పుడు ఈ పేరు సక్సెస్ కి పర్యాయపదం. ఆమె ఉంటే అందరినీ లక్ వరిస్తుందనే అభిప్రాయం ఏర్పడింది. దానికి నిదర్శనం వరుసగా అందరు హీరోలతో సక్సెస్ లు చవిచూడటమే. నిజానికి పూజ వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్నపుడు ‘దువ్వాడ జగన్నాధం DJ’ లో అమ్మడి గ్లామరస్ సైడ్‌ని ఆవిష్కరించడంలో తనకు సహాయపడింది అల్లు అర్జున్. ఇక ఆ తర్వాత పూజ వెనుదిరిగి చూసుకునే అవకాశం కలగలేదు. సినిమా సినిమాకు తన గ్లామర్ ని పెంచుకోవడంతో పాటు డిమాండ్ కూడా పెంచుకుంటూ పోతోంది. ఇక తాజాగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’లో తనలోని నటిని కూడా ఆవిష్కరించింది పూజ. అంతే కాదు ఆ సినిమాతో వరుస పరాజయాల్లో ఉన్న అఖిల్, దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ కి కూడా సక్సెస్ రుచి చూపించింది.
Read Also : పవన్ షాకింగ్ డెసిషన్… సినీ ప్రియులకు మరోసారి నిరాశ
అంతకు ముందు ‘అరవింద సమేత వీరరాఘవ’లో ఎన్టీఆర్, మహర్షి లో మహేశ్ తో, గద్దలకొండ గణేశ్ లో వరుణ్ తేజ్ తో, అలవైకుంఠపురములో లో అల్లుఅర్జున్ తో నటించి వరుస హిట్స్ ని అందుకుంది. బాలీవుడ్ లోనూ ‘హౌస్ ఫుల్4’ తో పర్వాలేదనిపించుకుంది. ఇక ఒకే ఒక్క ‘సాక్ష్యం’ మాత్రమే తన పరాజయానికి సాక్ష్యంగా నిలిచింది. ఇప్పుడు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’తో మరో హిట్ కొట్టేసింది. ఇలా తనతో నటించిన ప్రతి హీరోతో హిట్ కొట్టి తను అందరికీ ప్రత్యేకం అనిపించుకుంది. అందుకే బన్నీ కూడా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ సక్సెస్ మీట్ లో పూజ నాకు మాత్రమే ప్రత్యేకం అనుకున్నా… కానీ తను అందరికీ ప్రత్యేకమే అనేశాడు. పూజా హేగ్డే ప్రస్తుతం తెలుగులో ‘ఆచార్య, రాధేశ్యామ్’, తమిళంలో విజయ్ తో ‘బీస్ట్’, బాలీవుడ్ లో రణ్‌వీర్ సింగ్ తో ‘సర్కస్’ సినిమాల్లో నటిస్తోంది. మరి ఆ సినిమాలతో పూజ ఎలాంటి విజయాలను అందుకుంటుందో చూద్దాం.
