Nandamuri Balakrishna: సాధారణంగా ఇండస్ట్రీలో ఎప్పుడు కలవని కలయికలు కలిసినప్పుడు అభిమానుల్లో ఒక తెలియని ఉత్సాహం వస్తూ ఉంటుంది. ఇక తమ అభిమాన హీరోలిద్దరు ఒకే స్టేజిపై కనిపిస్తే అభిమానులకు పండుగే. ప్రస్తుతం ఆ పండుగే చేసుకుంటున్నారు నందమూరి- మెగా ఫ్యాన్స్. నందమూరి బాలకృష్ణ- పవన్ కళ్యాణ్ ఒకే ఫ్రేమ్ లో కనిపించి సందడి చేశారు. ఇప్పటికే బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షో కు పవన్ గెస్ట్ గా వస్తున్న విషయం తెల్సిందే. త్వరలోనే ఈ ఎపిసోడ్ షూట్ జరగనుంది. ఇక దానికి ముందే ఈ కాంబో కలిసి కనిపించడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. తాజాగా వీరసింహారెడ్డి సినిమా షూటింగ్ లో బాలయ్యను పవన్ కలిశారు. కొద్దిసేపు ఆయన చిత్ర బృందంతో ముచ్చటించారు.
ప్రస్తుతం బాలయ్య వీరసింహరెడ్డి షూటింగ్ లో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. అనుకోకుండా జరిగిందో.. కావాలనే జరిగిందో తెలియదు కానీ.. వీరసింహారెడ్డి షూట్ లో పవన్ ప్రత్యక్షమయ్యారు. ఇక ఒకే ఫ్రేమ్ లో బాలయ్య- పవన్ కనిపించడంతో అభిమానులు ఈ ఫోటోను వైరల్ చేస్తున్నారు. ఇక ఈ ఫొటోలో పవన్ పొలిటికల్ లుక్ లోనే ఉండగా.. బాలయ్య కలర్ ఫుల్ కాస్ట్యూమ్ లో కనిపించారు. చిత్ర బృందం మొత్తం పవన్ తో కలిసి ఫోటో దిగింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఒక ఫోటోకే ఇంత హంగామా ఉంటే.. అన్ స్టాపబుల్ ఎపిసోడ్ రిలీజ్ అయితే ఎంత హంగామా చేస్తారో చూడాలి.