Site icon NTV Telugu

Bheemla Nayak : ఫ్యాన్స్ విరాళాలు!

bheemla nayak

bheemla nayak

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’ ఫిబ్రవరి 25న జనం ముందుకు వస్తోందని తెలిసినప్పటి నుంచీ అభిమానుల్లో సంబరం మొదలయింది. ఈ సినిమా రిలీజ్ నాటికి ఏపీ గవర్నమెంట్ ప్రదర్శన ఆటలు, టిక్కెట్ రేట్ల విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటుందని భావించారు. కానీ, ఎప్పటిలాగే పరిమిత ప్రదర్శనలు, మునుపటి రేట్లతోనే సాగాలని ప్రభుత్వం ఆదేశించడంతో అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. పవన్ నటించిన ‘భీమ్లా నాయక్’ పలు రికార్డులు బద్దలు చేస్తుందని, నిర్మాతలకు, కొనుగోలుదారులకు లాభాలు చేకూరుస్తుందని ఫ్యాన్స్ భావించారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఇంకా టిక్కెట్ రేట్లపై, ప్రదర్శన ఆటలపై ప్రభుత్వం సూచించిన తీరే సాగుతూ ఉండడంతో అభిమానులు నిరాశ చెందారు. దాంతో ఈ సినిమాకు మునుపటిలా ‘బెనిఫిట్ షోస్’ కు అనుమతి ఇవ్వాలని చిత్తూరులో పవన్ ఫ్యాన్స్ ఆందోళనకు దిగారు. ఇదిలా ఉంటే, మాచర్లలో పవన్ అభిమానులు మరో అడుగు ముందుకేసి ఓ చోట గేటుకు ఓ డబ్బాను కట్టారు. దానిపై ‘భీమ్లా నాయక్’ పోస్టర్ పెట్టారు. అందులో పవన్ కళ్యాణ్ బొమ్మ పక్కనే “సినిమా డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోకుండా వారికి మాకు చేతనైన సహకారం కొరకు మాచర్ల పవన్ కళ్యాణ్ అభిమానుల తరపున విరాళాల సేకరణ” అంటూ అందులో పేర్కొన్నారు. ఇలా ‘భీమ్లా నాయక్’ కోసం ఏపీలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

Read Also : Bheemla Nayak: అలా చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసి, టిక్కెట్ రేట్ల విషయంలో ఓ నిర్ణయం తీసుకొనేందుకు కసరత్తు చేసింది. కానీ, ఆ కమిటీ సిఫారసు చేసిన అంశాలేవీ ఇంకా బయటకు రాలేదు. ఈ తాత్సరం సాగుతూ ఉండగానే , పవన్ కళ్యాణ్‌ ‘భీమ్లా నాయక్’ విడుదల తేదీ ప్రకటించేశారు. మా హీరో ఏ మాత్రం ప్రభుత్వానికి జంకలేదని, అందుకే థియేటర్లకు వస్తున్నాడని అభిమానులు విశేషంగా ప్రచారం చేసుకున్నారు. అలాగే తమ హీరో సినిమా కొన్నవారికి నష్టాలు వాటిల్లకుండా ఉండేందుకు బెనిఫిట్ షోస్ కోసం డిమాండ్ చేయడం, విరాళాలు సేకరించడం వంటివి చేపట్టారు. ఈ కోణంలో పవన్ ఫ్యాన్స్ ను అబినందించి తీరవలసిందే! మరి ‘భీమ్లా నాయక్’ విడుదల రోజున అభిమానులు ఇంకా ఏమేమి చేస్తారో చూడాలి.

Exit mobile version