NTV Telugu Site icon

Pawan Kalyan: గుండెకు గొంతు వస్తే.. బాధకు భాష వస్తే.. అది గద్దర్.. గుండెలను పిండేస్తున్న పవన్ కవిత

Voshal

Voshal

Pawan Kalyan: ప్రజా గాయకుడు గద్దర్ నిన్న మృతి చెందిన విషయం తెల్సిందే. అల్వాల్‌లోని ఆయన ఇంటివద్ద జులై 20న తీవ్ర అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు అమీర్‌పేటలోని అపోలో స్పెక్ట్రా ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అప్పటి నుంచి హాస్పిటల్ లోనే చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో ఒక్కసారిగా మావోయిస్ట్ పార్టీతో పాటు తెలంగాణ మొత్తం విషాదంలో కూరుకుపోయింది. సినీ , రాజకీయ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. నేడు మహాబోధి విద్యాలయ ఆవరణలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు ముగిశాయి. ప్రజా యుద్ధనౌకఅని పిలుచుకునే గద్దర్ గానం, గొంతు ఇక వినిపించదు అని తెలియడంతో అభిమానులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇక గద్దర్ మరణం.. జనసేనాని పవన్ కళ్యాణ్ ను మరింత క్రుంగ తీసింది అని చెప్పాలి. ఆయనకు, పవన్ కు మధ్య ఉన్న అవినాభావ సంబంధం గురించి అందరికి తెల్సిందే. నిన్న గద్దర్ కు నివాళులు అర్పించేటప్పుడు పవన్ ఎంతగా ఎమోషనల్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తాజాగా గద్దర్ పై ఉన్న ప్రేమను పవన్ ఒక కవిత రూపం లో తెలిపారు. తన ఇన్స్టాగ్రామ్ లో ఆ వీడియోలను షేర్ చేశారు. పవన్ గురించి గద్దర్ చెప్పిన మంచి మాటలను కూడా వీడియో ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

“బీటలు వాలే ఎండలో.. సమ్మెట కొట్టే కూలికి గొడుగు గద్దర్. తాండాలా బండలో చలిపులిని బెదిరించే నెగడు గద్దర్. పీడిత జనుల పాట గద్దర్. అణగారిన ఆశల ఆర్తి గద్దర్. అడవి లో ఆకు చెప్పిన కథ గద్దర్. కోయిల పాడిన కావ్యం గద్దర్. గుండెకు గొంతు వస్తే.. బాధకు భాష వస్తే.. అది గద్దర్. అన్నింటిని మించి నా అన్న గద్దర్. అన్నా.. నువ్వు గాయపడ్డ పాటవి. కానీ, ప్రజల గాయాలకు పట్టుబడ్డ పాటవి. అన్యాయంపై తిరగబడ్డ పాటవి. ఇదివరకు నువ్వు ధ్వనించే పాటవి.. ఇప్పుడు లక్షల గొంతుల్లో ప్రతిధ్వనించే పాటవి. తీరం చేరిన ప్రజా యుద్ధనౌకకి.. జోహార్.. జోహార్.. జోహార్ ” అంటూ పవన్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.