మ్యాచో హీరో గోపీచంద్ ఇటీవల ‘సీటిమార్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకొంది కానీ గోపీచంద్ కి మాత్రం భారీ విజయాన్ని అయితే అందించలేకపోయింది. ఇక దీంతో గోపీచంద్ ఆశలన్నీ తన తదుపరి సినిమా మీదనే పెట్టుకున్నాడు. హిట్ దర్శకుడు మారుతీ దర్శకత్వంలో గోపీచంద్- రాశీఖన్నా జంటగా నటిస్తున్న చిత్రం ‘పక్కా కమర్షియల్’. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్- యూవీ క్రియేషన్స్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మొదటి పాటను విడుదల చేయడానికి మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారు. పక్కా కమర్షియల్ టైటిల్ సాంగ్ ని ఫిబ్రవరి 2వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలిపిన సంగతి తెలిసిందే.
ఇక తాజాగా ఈ సాంగ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక ఈ పాటను దివంగత గేయ రచయిత సిరివెన్నెల రాయడం విశేషం. ఇది సిరివెన్నెల కలం నుంచి జాలువారిన మరో అక్షరమాల అంటూ ఆయనకు అంకితం ఇచ్చారు. ఇక సాంగ్ చూస్తుంటే జీవితంలో డబ్బుకున్న విలువ ఎలాంటిది అనేది వివరించారు. చుక్కా.. ముక్కా అన్నీ కమర్షియలే అంటూ జీవిత సారాంశాన్ని వినోదాత్మకంగా చూపించినట్లు తెలుస్తోంది. ఇక లిరిక్స్ కి తగ్గట్లే గోపీచంద్ మెడలో డబ్బుల దండతో.. కరెన్సీ నోట్లు ప్రింట్ చేయబడిన షర్ట్ ధరించి డాన్స్ తో అదరగొట్టేశాడు. మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బిజోయ్ మ్యూజిక్, హేమచంద్ర హస్కీ వాయిస్ తో ఈ పాట దుమ్మురేపడం ఖాయం అంటున్నారు సంగీత అభిమానులు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.