F2F With TammaReddy Bharadwaja:
ప్రస్తుతం టాలీవుడ్‌లో పలు సినిమాల షూటింగ్‌లు నిలిచిపోయాయి. చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడం కోసం టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ షూటింగులు నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఈ సంక్షోభానికి నిర్మాతలే కారణమని ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆరోపించారు. ఎన్టీవీ ఆయనతో ప్రత్యేకంగా ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ నిర్వహించగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం సినిమా పరిశ్రమ వక్రమార్గం తీసుకుందని తమ్మారెడ్డి అన్నారు. గత ఐదేళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమ రూపురేఖలే మారిపోయాయని.. ముఖ్యంగా చెప్పాలంటే బాహుబలి సినిమా తర్వాత నిర్మాతల ఆలోచన ధోరణిలో మార్పు వచ్చిందని పేర్కొన్నారు. హీరోల రెమ్యునరేషన్‌లలో కూడా మార్పులు వచ్చాయన్నారు. నిర్మాతలకు లాభాలు వస్తే వందల కోట్లలో వస్తున్నాయని.. అలాగే నష్టాలు వస్తే నిండా మునిగిపోతున్న పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఎప్పుడైతే డబ్బులు ఎక్కువ రావడం మొదలుపెట్టాయో కంట్రోల్ తప్పిందన్నారు. థియేట్రికల్ బిజినెస్ తగ్గుతూ వస్తోందని.. ఓటీటీ బిజినెస్‌ను నిర్మాతలే పెంచేశారని తమ్మారెడ్డి వివరించారు.
ప్రస్తుతం తెలుగు సినిమా క్వాలిటీ, కంటెంట్ పడిపోయిందని తమ్మారెడ్డి చెప్పారు. సోకుల మీద పెడుతున్న ఖర్చు నిర్మాతలు సినిమాలో విషయంపై పెట్టడం లేదని ఆరోపించారు. కొందరు నిర్మాతలు ఏ సినిమా తీస్తున్నారో వారికి కూడా తెలియని అయోమయ పరిస్థితి నెలకొందన్నారు. కొందరు నిర్మాతల ఏకఛత్రాధిపత్యంతో సినిమా పరిశ్రమ దిగజారిపోయే పరిస్థితికి వచ్చిందన్నారు. నిర్మాతల మండలిలో ప్రొడ్యూసర్స్ గిల్డ్ విలీనం కావడం అవసరమన్నారు. సినిమా కార్మికులు కేవలం సినిమాపైనే ఆధారపడటం లేదని.. వాళ్లకు ఓటీటీలు ఉన్నాయి.. టీవీలు ఉన్నాయని తమ్మారెడ్డి అభిప్రాయపడ్డారు. కార్మికులు పూర్తిగా రోడ్డు మీదకు వచ్చే పరిస్థితులు ప్రస్తుతం లేవన్నారు. గతంలో సినిమా షూటింగులు బంద్ అయితే కార్మికుల జీవితాలు నాశనం అయ్యేవని.. ఇప్పుడా పరిస్థితి లేదని వివరించారు. సినీ పరిశ్రమ సేఫ్‌గా ఉండాలంటే సినిమా టిక్కెట్ రేట్లు పెంచాల్సిన అవసరం లేదన్నారు. మంచి సినిమాలు రావాలని.. అవి ప్రేక్షకులకు అందుబాటు ధరల్లో ఉండాలని తమ్మారెడ్డి అన్నారు.
Read Also: Darlings Review: డార్లింగ్స్ రివ్యూ (హిందీ)
అడ్డగోలుగా సినిమాల టిక్కెట్ రేట్లు పెంచడం వల్ల యూత్‌ను, ఫ్యామిలీలను సినిమాల నుంచి దూరం చేసుకున్న పరిస్థితి ప్రస్తుతం ఉందని తమ్మారెడ్డి అన్నారు. సినిమాలో దమ్ముంటే ఎక్కువ మందికి ఆ సినిమా చూపించి వసూళ్లు రాబట్టాలని తెలిపారు. జనం ఎందుకు థియేటర్లకు రావడం లేదో నిర్మాతలు ఆలోచించాలన్నారు. కొందరు నటుల గొంతెమ్మ కోరికల కారణంగా ఖర్చు తడిచి మోపెడు అవుతుందన్నారు. సినిమా అంటే ప్యాషన్‌గా చూడాలని.. బిజినెస్‌గా చూస్తే అది నాశనం కాక మానదన్నారు. పాన్ ఇండియా పేరుతో నిర్మాతలకు బలుపు వచ్చి విర్రవీగుతున్నారన్నారు. బడ్జెట్ పెంచి టిక్కెట్ల ధరలు పెంచడం సబబు కాదన్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలోఉన్న సమస్యలు దేశమంతటా ఉన్నాయని.. కాకపోతే మనోళ్లు కొంచెం ముందుగా కళ్లు తెరిచారని తమ్మారెడ్డి చెప్పారు.