NTV Telugu Site icon

20 years of Aadi : య‌న్టీఆర్ ను మాస్ హీరోగా నిలిపిన ఆది

Aadi

(మార్చి 28తో య‌న్టీఆర్ ఆదికి 20 ఏళ్ళు)
యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్ ను ప‌వ‌ర్ ఫుల్ మాస్ హీరోగా జ‌నం ముందు నిలిపిన చిత్రం ఆది. య‌న్టీఆర్ కెరీర్ ను మ‌ల‌చిన రెండు చిత్రాలు స్టూడెంట్ నంబ‌ర్ వ‌న్, ఆది అనే చెప్పాలి. ఈ రెండు చిత్రాల ద్వారా రాజ‌మౌళి, వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌కులుగా పరిచ‌యం కావ‌డ‌మూ విశేష‌మే! త‌రువాతి రోజుల్లోనూ ఈ ఇద్ద‌రు ద‌ర్శ‌కులు యంగ్ టైగ‌ర్ తో స‌క్సెస్ ఫుల్ జ‌ర్నీ సాగించారు. తెలుగు సినిమా రంగంలో ఫ్యాక్ష‌నిజంకు హీరోయిజం అద్దిన చిత్రంగా స‌మ‌ర‌సింహారెడ్డి నిల‌చింది. అప్ప‌టి నుంచీ తెలుగు చిత్రసీమ‌లో అంద‌రు హీరోలు ఆ త‌ర‌హా క‌థ‌ల వెంట ప‌రుగులు తీశారు. వినాయ‌క్ సైతం త‌న తొలిచిత్రానికి ఫ్యాక్ష‌నిజాన్నే నేప‌థ్యంగా ఎంచుకోవ‌డం గ‌మ‌నార్హం! 2002 మార్చి 28న విడుద‌లైన ఆది అనూహ్య విజ‌యం సాధించింది. ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేశ్ నిర్మించారు.

ఆది క‌థ‌లోకి తొంగి చూస్తే – అమెరికాలో ఉన్న వీరారెడ్డి తండ్రి ఫ్యాక్ష‌నిస్ట్. వారికి నాలుగువేల ఎక‌రాల భూమి ఉంటుంది. తండ్రి మ‌ర‌ణంతో ఆ పొలాన్ని నిర్వ‌హించ‌మ‌ని నాగిరెడ్డి అనే అత‌నికి ఇస్తాడు. కొన్నాళ్ళ త‌రువాత త‌న భార్య‌, కొడుకు ఆదికేశ‌వ రెడ్డితో ఇండియాకు వ‌స్తాడు వీరారెడ్డి. అయితే నాగిరెడ్డి త‌మ పొలాన్ని అడ్డు పెట్టుకొని అంద‌రిపై పెత్త‌నం చెలాయిస్తూ దుర్మార్గంగా ఉంటాడు. దాంతో ఆ పొలాన్ని రెండు వేల పేద కుటుంబాల‌కు రాసి ఇవ్వాల‌ని భావిస్తాడు. ఇది తెలిసిన నాగిరెడ్డి, వీరారెడ్డిని అత‌ని భార్య‌ను చంపేస్తాడు. ఆ పోరాటంలో నాగిరెడ్డి మ‌నుషులు, వీరా రెడ్డి మ‌నుషులు పోట్లాడుకుంటారు. కొంద‌రు వీరారెడ్డి మ‌నుషులు హ‌త్యానేరంపై జైలుకు వెళ‌తారు. వీరారెడ్డిని అభిమానించే మ‌రికొంద‌రు ఆదికేశ‌వ రెడ్డిని ఎత్తుకు పోయి హైద‌రాబాద్ లో పెంచిపెద్ద చేస్తారు. 12 ఏళ్ళ త‌రువాత ఆది కాలేజ్ లో చ‌దువుకుంటూ ఉంటాడు. అత‌నిని పెంచి పెద్ద చేసిన వీర‌న్న‌ను బాబాయ్ అంటూ పిలుస్తుంటాడు. ఆది చ‌దివే కాలేజ్ లోనే నాగిరెడ్డి కూతురు నందు కూడా చ‌దువుతూ ఉంటుంది. ఆమెకు ఆది అంటే ఎంతో ఇష్టం. త‌రువాత వారి మ‌ధ్య ప్రేమ చిగురిస్తుంది. చ‌దువు పూర్త‌య్యాక నందు త‌మ ఊరెళుతుంది. జైలు నుండి వీరా రెడ్డి మ‌నుషులు విడుద‌ల‌వుతారు. వారి ద్వారా ఆదికి అస‌లు విష‌యం తెలుస్తుంది. దాంతో ర‌గిలిపోతాడు. త‌న సొంత‌వూరుకు వెళ‌తాడు. నాగిరెడ్డి ఇంటికి నేరుగా వెళ్ళి స‌వాల్ విస‌రుతాడు. త‌మ ఊరిలో ఆదిని చూసి నందు ఆశ్చ‌ర్య పోతుంది. త‌రువాత ఆమెకు కూడా నిజం తెలుస్తుంది. ఆది అంత స్థాయికి రావ‌డానికి కార‌ణం వీర‌న్న అని తెలుసుకున్న నాగిరెడ్డి అత‌ణ్ణి ఓ ప‌థ‌కం ప్ర‌కారం చంపేస్తాడు. త‌న‌ను పెంచి పెద్ద చేసిన బాబాయ్ చ‌నిపోవ‌డంతో ఆది ర‌గిలిపోతాడు. నాగిరెడ్డిని, అత‌ని కొడుకును, మ‌నుషుల‌ను చిత‌క బాదుతాడు. చివ‌ర‌కు త‌న బాబాయ్ స‌మాధి ప‌క్క‌నే తీసిన గొయ్యిలో నాగిరెడ్డిని ప‌డేస్తాడు. నాగిరెడ్డి దుర్మార్గానికి బ‌లై పోయిన జ‌నం, అత‌నిపై మ‌ట్టి వేస్తారు.చివ‌ర‌కు నాగిరెడ్డి క‌ట్టుకున్న భార్య సైతం అత‌ని చావు కోరుతూ మ‌ట్టి వేస్తుంది. నాగిరెడ్డి అంతంతో క‌థ ముగుస్తుంది.

ఆదికేశవ రెడ్డిగా య‌న్టీఆర్ న‌టించిన ఈ చిత్రం ద్వారా కీర్తి చావ్లా నాయిక‌గా ప‌రిచ‌యం అయింది. ఇందులో రాజ‌న్ పి. దేవ్, చ‌ల‌ప‌తిరావు, ఆహుతి ప్ర‌సాద్, ఎమ్మెస్ నారాయ‌ణ‌, ఎల్బీ శ్రీ‌రామ్, సంగీత‌, ఆలీ, రాజీవ్ క‌న‌కాల‌, ర‌ఘు కారుమంచి, వేణు మాధ‌వ్, చిత్రం శ్రీ‌ను, ర‌ఘుబాబు, ఫిష్ వెంక‌ట్, క‌రాటే క‌ళ్యాణి, ర‌మ్య‌శ్రీ ముఖ్య‌తారాగ‌ణం. ఈ చిత్రానికి ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ ర‌చ‌న చేశారు. మ‌ణిశ‌ర్మ స్వ‌ర‌క‌ల్ప‌న‌లో రూపొందిన బాణీల‌కు భువ‌న‌చంద్ర‌, చంద్ర‌బోస్, పోతుల ర‌వికిర‌ణ్ పాట‌లు ప‌లికించారు. అయ్యో రామ‌..., సున్నండ తీసుకో..., నీ న‌వ్వుల తెల్ల‌ద‌నాన్ని..., అందిన‌దైనా మ‌న‌దే... అంద‌నిదైనా మ‌న‌దే..., ప‌ట్టు ఒక‌టి...`,,తొలి పిలుపే…“ అంటూ సాగే పాట‌లు అల‌రించాయి. అప్ప‌ట్లో ఈ సినిమా ఆడియో సేల్స్ కూడా అద‌ర‌హో అనిపించాయి.

జూనియ‌ర్ య‌న్టీఆర్ చిత్ర‌సీమ‌లో ప్ర‌వేశించే నాటికే అత‌నికి అభిమానులు యంగ్ టైగ‌ర్ అని జేజేలు ప‌లికారు. అయితే యంగ్ టైగ‌ర్ మొద‌టి సినిమా నిరాశ ప‌ర‌చింది. త‌రువాత స్టూడెంట్ నంబ‌ర్ వ‌న్ ఊపునిచ్చింది. కానీ, మాస్ కు త‌గ్గ ఇమేజ్ ను మాత్రం ఆదినే సంపాదించి పెట్టింది అని చెప్ప‌వ‌చ్చు. ఇందులో అందిన‌దైనా మ‌న‌దే... పాట‌లో య‌న్టీఆర్ పాట పాడే బ్యాక్ డ్రాప్ లో న‌ట‌ర‌త్న య‌న్టీఆర్, బాల‌కృష్ణ‌, హ‌రికృష్ణ చిత్రాల‌ను కూడా చూపించ‌డం అభిమానుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ఇందులో జూనియ‌ర్ అభినయం మురిపించింది. దాంతో త‌న‌కంటూ కొంత‌మంది సొంత అభిమానులను సంపాదించుకోగ‌లిగారు. ముఖ్యంగా య‌న్టీఆర్ చెప్పిన డైలాగులు జ‌నాన్ని క‌ట్టిప‌డేశాయి. అలాగే ఆయ‌న తొడ‌గొట్టిన సీన్ కూడా భ‌లేగా పండింది.

ఆ రోజుల్లో వ‌చ్చిన అనేక ఫ్యాక్ష‌నిస్టు క‌థ‌ల్లాగే ఇందులోనూ ప‌గ‌, ప్ర‌తీకారాలే ప్ర‌ధానాంశ‌మ‌యినా, వినాయ‌క్ త‌న‌దైన శైలిలో చిత్రాన్ని జ‌న‌రంజ‌కంగా మలిచారు. ఉత్త‌మ తొలి చిత్ర ద‌ర్శ‌కునిగా నంది అవార్డును అందుకున్నారు. ఫ్యాక్ష‌నిజం రంగు పులుముకున్న ఈ చిత్రంలోని నీ న‌వ్వుల తెల్ల‌ద‌నాన్ని... పాట‌తో చంద్ర‌బోస్ కు కూడా ఉత్త‌మ గీత‌ర‌చ‌యిత‌గా నంది అవార్డు ల‌భించింది. అదే నంది అవార్డుల్లో జూనియ‌ర్ య‌న్టీఆర్ కు స్పెష‌ల్ జ్యూరీ అవార్డు, గౌత‌మ్ రాజుకు బెస్ట్ ఎడిట‌ర్ అవార్డు కూడా ద‌క్కాయి.

ఆది చిత్రం తెలుగునేల‌పైని వంద‌లాది కేంద్రాల‌లో అర్ధ శ‌త‌దినోత్స‌వం జ‌రుపుకుంది. 90కి పైగా కేంద్రాల‌లో శ‌త‌దినోత్స‌వం చూసింది. కొన్ని కేంద్రాల‌లో ర‌జ‌తోత్స‌వ‌మూ చేసుకుంది. య‌న్టీఆర్ కు ఇదే తొలి బిగ్ హిట్ అని చెప్ప‌వ‌చ్చు. ఈ సినిమా ఘ‌న‌విజ‌యంతో య‌న్టీఆర్ కు స్టార్ స్టేట‌స్ ద‌క్కింది. హీరోగా ఆయ‌న స్థాయి పెరిగింది. ఇక ద‌ర్శ‌కునిగా వినాయ‌క్ ఈ ఒక్క చిత్రంతోనే స్టార్ డ‌మ్ అందుకున్నారు. నిర్మాత బెల్లంకొండ సురేశ్ కు ఆది మంచి లాభాలు సంపాదించిపెట్టింది.