Site icon NTV Telugu

NTR : ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా.. ఎన్టీఆర్ ఎమోషనల్..!

Tweet

Tweet

శ్రీరాముడు, శ్రీకృష్ణుడు విగ్రహా రూపాల కంటే.. వాళ్ల రూపం అచ్చం ఇలాగే ఉంటుందేమోనని అనిపించేలా.. ఇప్ప‌టికీ, ఎప్పటికీ.. తెలుగువారికి గుర్తుకొచ్చే రూపం ఆయనదే. న‌టుడిగా తెలుగు ప్రేక్ష‌కుడి గుండెల్లో.. నాయ‌కుడిగా తెలుగు వారి హృద‌యాల్లో ఆయ‌న వేసిన ముద్ర శాశ్వ‌తం. తెలుగు ప్రజల కీర్తిని ఖండాంతరాలకు చాటి చెప్పిన శక పురుషుని శత జయంతి సంవత్సరం ఇది. సినీనేత.. జననేత.. తిరుగులేని కథానాయకుడు.. ఎదురులేని మహానాయకుడు… విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు 100వ జయంతి నేడు. దాంతో తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. తమ అభిమాన నాయకుడిని స్మరించుకొని భావోద్వేగానికి లోనవుతున్నారు ప్రజలు. ఇక తమ తాతను తలుచుకుని ఎంతో ఎమోషనల్ అయ్యారు జూనియర్ ఎన్టీఅర్, కళ్యాణ్ రామ్. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ టాంక్ బండ్ ద‌గ్గ‌రున్న ఎన్టీఆర్ ఘాట్‌ను సంద‌ర్శించి నివాళులు అర్పించారు.

ఉద‌యం ఐదు గంట‌ల ప్రాంతంలో ఎన్టీఆర్, క‌ళ్యాణ్ రామ్‌.. ఎన్టీఆర్ ఘాట్‌కు విచ్చేసి.. నివాళులు అర్పించిన త‌ర్వాత అక్క‌డే కాసేపు కూర్చున్నారు. ఆ స‌మ‌యంలో అక్కడికి అభిమానులు భారీగా వ‌చ్చారు.. జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఇక అన్నగారు అంటే.. ప్రతి ఒక్క తెలుగువారికి ఒక ఎమోషన్ ఉంది. అయితే జూనియర్ ఎన్టీఆర్‌కి తన తాత పై ఉండే ప్రేమ మాత్రం మాటల్లో వర్ణించలేనిది. టాలీవుడ్ టాప్ హీరోగా.. యంగ్ టైగర్‌గా.. నిత్యం ఎన్టీఆర్ నామ స్మరణతో ముందుకు సాగుతున్నాడు. తన తాత పట్ల ప్రేమను, గౌరవాన్ని, విధేయతను మరోసారి చాటుతూ.. సదా మిమ్మల్ని స్మరించుకుంటూ.. అంటూ భావోద్వేగ ట్వీట్ చేశారు ఎన్టీఆర్. ‘మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది.. పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా .. అంటూ ఎమోషనల్ అయ్యారు జూనియర్ ఎన్టీఆర్. దాంతో తారక్ అభిమానులు మరింత ఎమోషనల్ అవుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Exit mobile version