Tollywood: గత వారం విడుదలైన సినిమాలేవీ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోవడంతో ‘కాంతార’ మూవీకే చెప్పుకోదగ్గ కలెక్షన్లు వస్తున్నాయి. దాంతో ఈ చిత్ర కథానాయకుడు, దర్శకుడు రిషభ్ శెట్టి తెలుగు రాష్ట్రాలలో ఎంపిక చేసిన ఊర్లలో సక్సెస్ టూర్ చేశారు. ఇదిలా ఉంటే ఈవారం ఏకంగా ఎనిమిది సినిమాలు థియేట్రికల్ రిలీజ్ కాబోతున్నాయి. గతంలో చిత్రీకరణ పూర్తి చేసుకుని, విడుదలలో జాప్యం జరిగిన సినిమాలే వీటిల్లో అధికంగా ఉన్నాయి.
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో అల్లు శిరీష్, అను ఇమ్మాన్యూల్ జంటగా రూపుదిద్దుకున్న సినిమా ‘ఊర్వశివో రాక్షసివో’. మొదట్లో ఈ సినిమాకు ‘ప్రేమ కాదంట’ అనే టైటిల్ పెట్టిన దర్శక నిర్మాతలు ఆ తర్వాత దాన్ని ‘ఊర్వశివో రాక్షసివో’గా మార్చారు. ‘విజేత’ ఫేమ్ రాకేశ్ శశి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ధీరజ్ మొగిలినేని నిర్మించారు. అచ్చు రాజమణి సంగీతాన్ని అందించారు. అలానే ఎంతో కాలం క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ‘బొమ్మ బ్లాక్ బస్టర్ ‘ మూవీ సైతం ఇప్పుడు విడుదల అవుతోంది. ఇందులో నందు, రష్మీ గౌతమ్ జంటగా నటించారు. హీరో నందు ఇందులో పూరి జగన్నాథ్ అభిమానిగా నటించడం విశేషం. రాజ్ విరాట్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి ప్రశాంత్ ఆర్ విహారి స్వరరచన చేశాడు. అలానే చాలా రోజుల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న మరో సినిమా ‘సారథి’ కూడా ఈ శుక్రవారమే విడుదల కానుంది. తారకరత్న నటించిన ఈ స్పోర్ట్స్ డ్రామాను జాకట రమేశ్ డైరెక్ట్ చేశాడు.
గ్రామీణ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ‘జెట్టి’ సినిమాలో నందిత శ్వేతా, మన్యం కృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను వేణు మాధవ్ కె నిర్మించారు. దీనికి సుబ్రహ్మణ్యం పిచ్చుక దరకత్వం వహించారు. కొద్దికాలంగా వాయిదా పడుతూ వస్తున్న ‘జెట్టి’ సైతం 4వ తేదీ జనం ముందుకు రాబోతోంది. వెర్సటైల్ యాక్టర్ అశోక్ సెల్వన్ నటించిన ద్విభాషా చిత్రం ‘ఆకాశం’. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను ఆర్. ఎ. కార్తీక్ తెరకెక్కించాడు. రీతూవర్మ, అపర్ణ బాలమురళి, శివాత్మిక రాజశేఖర్ ఇందులో హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీని వయాకామ్ 18, రైజ్ ఈస్ట్ సంస్థలు నిర్మించాయి. ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ శుక్రవారం జనాలను పలకరించబోతోంది.
బాలనటుడిగా కెరీర్ ప్రారంభించిన సంతోష్ శోభన్ ఇప్పుడు హీరోగా మంచి గుర్తింపును పొందే ప్రయత్నంలో ఉన్నాడు. అతని సినిమాలు కొన్ని ఓటీటీలో విడుదలై చక్కని ఆదరణ పొందాయి. అతని తాజా చిత్రం ‘లైక్, షేర్, సబ్ స్క్రైబ్’. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ‘జాతిరత్నాలు’ ఫేమ్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించింది. వెంకట్ బోయనపల్లి, నిహారిక ఎంటర్ టైన్ మెంట్ తో కలిసి ఈ సినిమాను నిర్మించారు. ఈ న్యూ ఏజ్ లవ్ ఎంటర్ టైనర్ పై ఆడియెన్స్ లో చక్కని ఆసక్తి నెలకొంది.
ఇక ఈ వారం రాబోతున్న మరో సినిమా ‘తగ్గేదే లే’. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ లో నవీన్ చంద్ర లీడ్ రోల్ ప్లే చేశాడు. ‘దండుపాలెం’ ఫేమ్ శ్రీనివాసరాజు దీనిని తెరకెక్కించాడు. దివ్యా పిళ్లై, అనన్య సేన్ గుప్తా హీరోయిన్స్‌గా నటించిన ఈ మూవీలో నైనా గంగూలీ ఐటమ్ సాంగ్ చేసింది. ఇదిలా ఉంటే… కన్నడలో రూపుదిద్దుకున్న ‘బనారస్’ మూవీ పాన్ ఇండియా స్థాయిలో నవంబర్ 4న విడుదల కాబోతోంది. కర్ణాటక సీనియర్ రాజకీయ నేత జమీర్ అహ్మద్ కుమారుడు జైద్ ఖాన్ హీరోగా ‘బెల్ బాటమ్’ ఫేమ్ జయతీర్థ దీనిని డైరెక్ట్ చేశాడు. బనారస్ సిటీ నేపథ్యంలో సాగే ఆహ్లాదకరమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రంలో సోనాల్ మోంటెరో కథానాయికగా నటిస్తోంది. తిలకరాజ్ బల్లాల్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. ‘నాంది’ సతీష్ వర్మ ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తున్నారు. వైవిధ్యమై కథలతో రూపుదిద్దుకున్న ఈ సినిమాలలో జనం దేనికి పట్టం కడతారో చూడాలి.
