No Update From Bhavadeeyudu Bhagat Singh Movie: ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో కొన్ని క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి కానీ, వాటిల్లో అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది మాత్రం ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా కోసమే! ఎందుకంటే.. గబ్బర్ సింగ్ తర్వాత ఆ సెన్సేషన్ కాంబో మళ్లీ ఈ కొత్త ప్రాజెక్ట్ కోసం చేతులు కలిపింది. అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో.. ఫ్యాన్స్ కావాల్సిన మాస్ ఎలిమెంట్స్ అన్నీ ఈ సినిమాలో ఉంటాయంటూ దర్శకుడు హరీశ్ శంకర్ కొన్ని క్రేజీ అప్డేట్స్ కూడా ట్విటర్ మాధ్యమంగా ఇచ్చాడు. దీంతో.. ఈ కాంబో తిరిగి ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకి వెళ్తుందా? ఆ సినిమా అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా? అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
ముఖ్యంగా.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజుని పురస్కరించుకొని, సెప్టెంబర్ 2వ తేదీన ఈ సినిమాకి సంబంధించి ఏదో ఒక క్రేజ్ అప్డేట్ వస్తుందని ఫ్యాన్స్ ఆశించారు. కొంతకాలం క్రితమే ఈ చిత్రాన్ని త్వరలో పట్టాలెక్కించే పనుల్లో ఉన్నామని హరీశ్ శంకర్ చెప్పాడు కాబట్టి, అందుకు సంబంధించిన అప్డేట్ పవన్ బర్త్ డే నాడు ఇస్తారేమోనని అభిమానులు భావించారు. కానీ, వాళ్లకు నిరాశే మిగిలింది. ఎందుకంటే, ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. నిజానికి.. ఈ సినిమాని ప్రకటించి చాలాకాలమే అవుతోంది. ఒకవేళ షూటింగ్ స్టార్ట్ చేసి ఉంటే, బహుశా ఈ పాటికే ఈ సినిమా రిలీజయ్యేదేమో! కానీ, టైటిల్ అనౌన్స్‌మెంట్ మినహాయించి, ఈ సినిమా కొంచెం కూడా ముందుకు కదలట్లేదు. ఇందుకు కారణం.. పవన్ ఇతర కమిట్మెంట్లే! ఒకవైపు క్రిష్ సినిమాతో పాటు వినోదయ సీతం రీమేక్, మరోవైపు పొలిటికల్ ప్లాన్స్ వల్ల.. భవదీయుడు భగత్ సింగ్‌కి పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వలేకపోతున్నాడు.
అయితే.. పవన్ పుట్టినరోజు ‘హరి హర వీరమల్లు’ నుంచి వచ్చిన ఒక స్టన్నింగ్ టీజర్ మాత్రం ఫ్యాన్స్‌ని సంతోషపెట్టింది. పవన్ లుక్, కీరవాణి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మల్లయోధుల్ని పవన్ ఎదురించే సీక్వెన్స్.. అన్ని అదిరిపోయాయని చెప్పొచ్చు. ఈ టీజర్‌తో సినిమాపై అంచనాలు మరిన్ని పెరిగాయి. ఇది అభిమానులకు ఫుల్ మీల్స్ అయితే పెట్టగలిగింది కానీ.. భవదీయుడు భగత్ సింగ్ నుంచి ఒక్క అప్డేట్ కూడా రాకపోవడమే కాస్త నిరాశకు గురి చేసింది. చూస్తుంటే, ఈ ప్రాజెక్ట్ మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది.