టాలీవుడ్ యువ నటుడు నితిన్ నార్నే నటిస్తున్న తాజా సినిమా సెట్స్‌లో ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో ఆయన కుడి భుజానికి తీవ్ర గాయమైంది. దీంతో మూవీ యూనిట్ ఆయన్ని హుటాహుటిన హైదరాబాద్‌లోని కిమ్స్ (KIMS) ఆసుపత్రికి తరలించారు. నవంబర్ 4న ఆస్పత్రిలో చేరిన ఆయన పరిస్థితిని సమీక్షించిన వైద్యులు.. తక్షణమే శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. కిమ్స్ ఆసుపత్రిలోని ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఆర్.ఏ. పూర్ణచంద్ర తేజస్వి నేతృత్వంలోని నిపుణుల బృందం (డాక్టర్ ఈశ్వర్ పటేల్, డాక్టర్ హరికృష్ణ బచ్చు, డాక్టర్ మధుసూదన్) ఈరోజు ఉదయం నితిన్ నార్ణేకు భుజం సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు.
ఆపరేషన్ సక్సెస్ కావడంతో అభిమానులు, చిత్ర బృందం ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఆయన పోస్ట్-ఆపరేటివ్ వార్డులో కోలుకుంటున్నారని, ఆరోగ్య పరిస్థితి పూర్తిగా నిలకడగా ఉందని డాక్టర్లు అధికారికంగా వెల్లడించారు. అయితే, గాయం స్వభావం దృష్ట్యా ఆయన కొద్దిరోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని, అలాగే భుజం తిరిగి సాధారణ స్థితికి వచ్చేందుకు పునరావాసం (Rehabilitation) తప్పనిసరి అని వైద్యులు సూచించారు. యంగ్ హీరో ఆస్పత్రి పాలయ్యాడన్న వార్తతో సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు షికార్లు చేయడం మొదలుపెట్టాయి. ఈ క్రమంలో కిమ్స్ ఆసుపత్రి యాజమాన్యం తీవ్రంగా స్పందించింది. నితిన్ ఆరోగ్యంపై వస్తున్న ఎలాంటి వదంతులను, కట్టుకథలను నమ్మవద్దని స్పష్టం చేసింది. నితిన్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, వారికి పూర్తి గోప్యత (ప్రైవసీ) కల్పించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఆసుపత్రి వర్గాలు కోరాయి. అనవసరమైన రద్దీ వల్ల ఆస్పత్రిలోని ఇతర రోగులకు, వైద్య సేవలకు అంతరాయం కలిగే ప్రమాదం ఉన్నందున ఎవరూ తమ ప్రాంగణానికి రావొద్దని తేల్చి చెప్పారు.

