Nithiin Reddy Speech At Macherla Niyojakavargam Pre Release Event: నితిన్, కృతి శెట్టి, కేథరీన్ తెరిసా ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా ఆగస్టు 12వ తేదీన విడుదలకు ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలోనే స్నేహితుల దినోత్సవం సందర్భంగా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో నితిన్ మాట్లాడుతూ.. తాను ఇండస్ట్రీకి వచ్చి 20 సంవత్సరాలు అవుతోందని, ఇది మీ (ఫ్యాన్స్‌ని ఉద్దేశించి) అభిమానం వల్లే సాధ్యమైందని, ఇందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని అన్నాడు. మీకోసం మరో 20 సంవత్సరాలు కూడా ఇలాగే కష్టపడుతుంటానని, మీ సపోర్ట్ ఎప్పుడు కావాలని కోరాడు.
ఇక మాచర్ల నియోజకవర్గం సినిమా విషయానికొస్తే.. ఇది తనకు చాలా ప్రత్యేకమైన సినిమా అన్నాడు. ఇందులో నటించిన వారందరూ చాలా కష్టపడ్డారని, ముఖ్యంగా సముద్రఖని డేట్స్ ఇష్యూస్ లేకుండా ఎప్పుడు రమ్మంటే అప్పుడు షూటింగ్‌కి హాజరయ్యారన్నాడు. వెన్నెల కిశోర్ ఈ సినిమాలోనే హైలైట్ అని, ప్రథమార్థంలో అతనితో తనకు మంచి కామెడీ సీన్లు ఉన్నాయని, అవి అందరినీ కడుపుబ్బా నవ్వించడం ఖాయమన్నాడు. ప్రథమార్థానికి వెన్నల కిశోరే బ్యాక్‌బోన్ అని కితాబిచ్చాడు. మహతి స్వరసాగర్ అందించిన ఆడియో ఆల్రెడీ హిట్ అయ్యిందన్నాడు. తమ కాంబోలో వచ్చిన భీష్మ, మాస్ట్రో ఆడియోస్ మంచి హిట్ అయ్యాయని.. ఇది అంతకుమించి పెద్ద హిట్ అయ్యిందని పేర్కొన్నాడు. ‘‘బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగా ఇవ్వడంలో మణిశర్మని కింగ్ అంటారు. కానీ, మహతి ఆయన కంటే బాగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. తండ్రికి మించిన తనయుడిగా ఈ సినిమాతో పేరు గడిస్తాడు’’ అని నితిన్ అన్నాడు. కొన్నిచోట్ల అతనిచ్చిన బ్యాక్‌గ్రౌండ్‌కి గూస్‌బంప్స్ కాదు, గూస్‌పింపుల్స్ రావడం ఖాయమని నితిన్ చెప్పాడు.
ఇక కృతి గురించి మాట్లాడుతూ.. ఆ అమ్మాయి చూడ్డానికి చాలా అమాయకంగా, ఇన్నోసెంట్‌గా కనిపిస్తుందని, కానీ చాలా షార్ప్ అని నితిన్ కొనియాడాడు. షూటింగ్ సమయంలో తాను అడిగే ప్రశ్నలు, లాజిక్స్ చాలా స్మార్ట్‌గా ఉంటాయని.. ఒక హీరోయిన్‌లో అలాంటి క్వాలిటీస్ చాలా రేర్‌గా ఉంటాయన్నాడు. తాను ఇండస్ట్రీలో దూసుకెళ్తోందని నితిన్ చెప్తుండగా, వెనుక నుండి ఇరవై సంవత్సరాలు కొనసాగాలనుందని కృతి చెప్పగా, తధాస్తు అంటూ నితిన్ జీవించాడు. దర్శకుడు శేఖర్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడని, అతనితో పాటు సాంకేతిక నిపుణులందరూ తమ బెస్ట్ ఇచ్చారన్నాడు. ఈ చిత్రం ప్రతిఒక్కరికీ ఫుల్ మీల్స్ ఇవ్వడం ఖాయమని, ప్రతిఒక్కరూ థియేటర్లకు వెళ్లి సినిమా చూడాలని నితిన్ కోరాడు.