గతంలో సవత్సరానికో సినిమాతో అలరించిన యంగ్ హీరో నిఖిల్.. తెరపై కనిపించి దాదాపు మూడేళ్లు కావొస్తుంది. చివరగా అర్జున్ సురవరం సినిమాలో కనిపించిన నిఖిల్.. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రాబోతున్నాడు. ప్రస్తుతం సుకుమార్ ప్రొడక్షన్లో.. ఆయన శిష్యుడు పల్నాటి సూర్యప్రతాప్ దర్శతక్వంలో ’18 పేజెస్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ ఎప్పుడో పూర్తయినా.. విడుదలకు మాత్రం నోచుకోవడం లేదు. సుకుమార్ కథను అందించిన సినిమా కావడంతో.. ఈ మూవీ పై భారీగానే ఆశలు పెట్టుకున్నాడు నిఖిల్. అయితే ఈ సినిమా తెలుగుకు మాత్రమే పరిమతమవనుంది. కానీ మరో రెండు ప్రాజెక్ట్స్‌తో మాత్రం.. పాన్ ఇండియా మార్కెట్ పై కన్నేశాడు నిఖిల్.
వాటిలో హిట్ మూవీ కార్తికేయకు సీక్వెల్‌గా కార్తికేయ2 రాబోతోంది. చందు మొండేటి తెరకెక్కిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా.. కార్తికేయకు కొనసాగింపులా కాకుండా.. అంతకు మించి అనేలా.. నిఖిల్ కెరీర్లో భారీ బడ్జెట్లో తెరకెక్కుతోంది. చందు మొండేటి కూడా ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు. ఇక ఈ కుర్ర హీరో నటిస్తున్న మరో మూవీ ‘స్పై’ కూడా పాన్ ఇండియా రేంజ్‌లోనే రాబోతోంది. ఐశ్వర్య మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్నఈ చిత్రానికి సంబంధించి.. తాజాగా ఫస్ట్ గ్లింప్స్‌ని రిలీజ్ చేశారు. ఇందులో నిఖిల్ ఎంతో స్టైలిష్‌గా కనిపించారు. టైటిల్‌కు తగినట్లుగానే నిఖిల్ గూఢచారి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. విజువల్స్ పరంగా ఈ సినిమా గ్రాండియర్‌గా ఉంది. ఈ ఏడాది దసరా కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. పాన్ ఇండియా సినిమాలు కావడంతో.. కార్తికేయ 2, స్పై సినిమాలపై భారీగానే ఆశలు పెట్టుకున్నాడు నిఖిల్. మరి పాన్ ఇండియా స్థాయిలో నిఖిల్ ఎలాంటి గుర్తింపు దక్కించుకుంటాడో చూడాలి.