Krithi Shetty: చిత్ర పరిశ్రమ అన్నాకా విజయాలు, అపజయాలు సర్వ సాధారణం. రెండిటిని ఒకేలా స్వీకరిస్తేనే ఈ ఇండస్ట్రీలో ఉండగలరు. అయితే మొదటి సినిమాతోనే హిట్ అందుకొని స్టార్ స్టేటస్ ను అందుకొంటే మాత్రం ఆ స్టేటస్ ను, ఆ పేరును నిలబెట్టుకోవడానికి ఆచితూచి అడుగులు వేయాలి. లేకపోతే ఆ ఒక్క హిట్ సినిమా తప్ప మరే సినిమాను అభిమానులు గుర్తుపెట్టుకోరు. ఇక అలా అర్జున్ రెడ్డి సినిమాతో మొదటి హిట్ అందుకున్న షాలిని పాండే ఇప్పటివరకు మరో హిట్ అందుకున్నదే లేదు. ఇక ఈమె బాటలోనే బేబమ్మ నడిచేలా ఉందా..? అంటే అవుననే అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఉప్పెన చిత్రంతో తెలుగునాట అడుగుపెట్టింది కృతి శెట్టి. మొట్ట మొదటి సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. సినిమా రిలీజ్ కాకముందే వరుస అవకాశాలను అందుకొంది. అయితే కుర్రతనమో, ఎలాంటి సినిమాలను ఎంచుకోవాలో తెలియదో ఏమో కానీ బేబమ్మ కొద్దిగా తొందపడింది అనే మాట వస్తుంది.
మొదటి సినిమా తప్ప అమ్మడి ఖాతాలో దాన్ని మించిన హిట్ పడలేదు అంటే అతిశయోక్తి కాదు. ఇక కృతి వరుస మూడు సినిమాలు పరాజయాన్ని చవిచూశాయి. బంగార్రాజు అంతంత మాత్రంగా ఆడినా.. వారియర్, మాచర్ల నియోజకవర్గం పరాజయాన్ని మూటగట్టుకున్నాయి. దీంతో ఒకప్పుడు గోల్డెన్ లెగ్ అని పొగిడినవారే ఇప్పుడు కృతి ని ఐరెన్ లెగ్ అనేస్తున్నారు. అంతేకాకుండా ఇక చేసింది చాలు.. వెళ్లి చదువుకో అంటూ హితోపదేశాలు చేస్తున్నారు. ప్రస్తుతం బేబమ్మ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. సుధీర్ బాబు సరసన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే చిత్రంలో నటిస్తుండగా.. కోలీవుడ్ లో సూర్య సరసన అచలుడు చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాలపైనే అమ్మడి కెరీర్ ఆధారపడింది. మరి ఈ సినిమాలు బేబమ్మ కు ఎలాంటి రిజల్డ్ ను అందిస్తాయో చూడాలి.