NBK 107: అఖండ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 107వ మూవీ టైటిల్‌ను శుక్రవారం సాయంత్రం అధికారికంగా ప్రకటించనున్నారు. కర్నూలులోని కొండారెడ్డి బురుజు వేదికగా రాత్రి 8:15 గంటలకు బాలయ్య కొత్త సినిమా టైటిల్ వెల్లడి కానుంది. అయితే చిత్ర యూనిట్ ప్రకటించకముందే ఈ సినిమా టైటిల్ సోషల్ మీడియాలో షికారు చేస్తోంది. బాలయ్యకు సింహా అనే టైటిల్ అంటే సెంటిమెంట్. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సీమ సింహం, లక్ష్మీనరసింహా, సింహా, జై సింహా ఇలా చాలా సినిమాలకు సింహా అనే టైటిల్ వచ్చేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ఒక్కోసారి ఈ సెంటిమెంట్ కలిసొస్తే.. ఒక్కోసారి మాత్రం వికటించింది. సీమ సింహం, జై సింహా వంటి సినిమాలు నిరాశపరిచాయి.
Read Also: శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలంటే ఇవి పాటించండి..
అయితే తాజాగా గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి ‘వీరసింహారెడ్డి’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మిస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఈ మూవీకి సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అఖండ కంటే ఎక్కువగా ఈ సినిమాకు బిజినెస్ జరుగుతోందని టాలీవుడ్ ఫిలింసర్కిళ్లలో టాక్ నడుస్తోంది. ముఖ్యంగా నైజాంలో ఈ సినిమాకు మంచి ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. నిర్మాతలు చెబుతున్న ప్రకారం అయితే నైజాం హక్కులు రూ.20 కోట్లకు అమ్ముడుపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అఖండ సినిమా నైజాంలో రూ.10.5 కోట్లకు అమ్ముడుపోగా రూ.19 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ వసూలు చేసింది.