Diwali Special : జగపతిబాబు షోలో ఏపీ మంత్రి నారా లోకేశ్.. డబుల్ ధమాకా!

Zee

Zee

రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నిత్యం ప్రజాక్షేత్రంలో బిజీగా ఉండే నారా లోకేశ్ తొలిసారిగా బుల్లితెరపై వినోదాత్మక వేదికను పంచుకోనున్నారు. టాలీవుడ్ ప్రముఖ నటుడు జగపతి బాబు హోస్ట్ చేస్తున్న షోకి ఆయన ప్రత్యేక అతిథిగా రావడం ఇప్పుడు సర్వత్రా తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీపావళి పండుగ వారాంతం సందర్భంగా ప్రేక్షకులకు మునుపెన్నడూ లేని వినోదాన్ని అందించేందుకు జీ తెలుగు ఈ అదిరిపోయే ప్లాన్ చేసింది. ఒకవైపు పొలిటికల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ కాంబో.. మరోవైపు బుల్లితెర తారల తళుకులతో కూడిన అవార్డుల వేడుకతో వీక్షకులకు డబుల్ ధమాకా ఇవ్వడానికి సిద్ధమైంది. నవంబర్ 8 (ఆదివారం) రాత్రి 7:30 గంటలకు ప్రసారం కానున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2’ ఎపిసోడ్ ఈ దీపావళికి సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలవనుంది. విలక్షణ నటుడు జగపతిబాబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ వేదికపై మంత్రి నారా లోకేశ్ సందడి చేయనున్నారు. తన వ్యక్తిగత, రాజకీయ జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన, ఎవరికీ తెలియని విషయాలను ఆయన జగపతిబాబుతో పంచుకోనున్నారు.

దీని కంటే ముందుగా, నవంబర్ 7 శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రేక్షకుల ఆరాధ్య వేడుక ‘జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2026 పార్ట్-2’ గ్రాండ్‌గా ప్రసారం కానుంది. ప్రముఖ యాంకర్ సుమ కనకాల హోస్ట్ చేయనున్న ఈ కార్యక్రమం.. టెలివిజన్ రంగంలో ఆమె 25 ఏళ్ల ప్రయాణాన్ని పురస్కరించుకుని ఒక ప్రత్యేకమైన ఇంట్రడక్షన్‌తో ఘనంగా ప్రారంభం కాబోతోంది. ఈ అవార్డుల పండుగకు సినీ తారలు బాబు మోహన్, లయ, రాజీవ్ కనకాల, శివబాలాజీ, బ్రహ్మాజీ, నివేదా పేతురాజ్, మధుమిత, బాబా భాస్కర్, గెహనా సిప్పీ, మానస వారణాసి తదితరులు హాజరై సందడి చేయనున్నారు. మధ్యాహ్నం మహానాయకుడు, ఐకానిక్ కపుల్, లవర్ బాయ్, సూపర్ క్వీన్, పాపులర్ ఫేస్ ఆఫ్ ప్రైమ్ టైమ్ ఫిమేల్, ఉత్తమ కథానాయకుడు, నవనాయకి, ఉత్తమ కోడలు, తెలుగు అమ్మాయి తదితర విభాగాల్లో బుల్లితెర నటీనటులకు అవార్డుల ప్రదానం జరగనుంది.