విశ్వవిఖ్యాత నవరస నటనా సార్వభౌమ నందమూరి తారకరామారావు 30వ వర్ధంతి నేడు. యావత్ తెలుగు ప్రజల చేత అన్నగారు అని పిలిపించుకున్న ఎన్టీఆర్ 1996 జనవరి 18న మరణించారు. తెలుగు జాతి గర్వంగా, తెలుగు జాతి ప్రతీకగా నిలిచిన అన్నగారి వర్ధంతి సంధర్భంగా నందమూరి అభిమానులు, కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్ కి వెళ్లి నివాళులు అర్పిస్తున్నారు. తాతకి నివాళులు అర్పించడానికి కళ్యాణ్ రామ్ ఈ తెల్లవారుజామున ఎన్టీఆర్ ఘాట్ కి చెరుకుని ఎన్టీఆర్ సమాధికి పూలమాలలు అర్పించారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి అభిమానులు జై ఎన్టీఆర్ నినాదాలు చేసారు. ప్రతి సారి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కలిసి వచ్చేవారు. కానీ ఈ సారి కళ్యాణ్ రామ్ ఒక్కరే వచ్చారు.
ఇక మరోవైపు మంగళగిరి ఎమ్మెల్యే, ఆంధ్ర ప్రదేశ్ మంత్రి నారా లోకేష్ కొద్దిసేపటి క్రితం ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకొని తాతయ్య నందమూరి తారక రామారావు సమాధికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. అలాగే తెలుగు జాతి ఆత్మగౌరవ పతాకం, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, మహా నాయకుడు ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను. తారక రాముడు పోషించిన పౌరాణిక పాత్రల ఫోటోలను ఇళ్లలో పెట్టుకొని ప్రజలు దేవుడిగా పూజిస్తుండడం ఎన్టీఆర్ గారికి మాత్రమే దక్కిన అరుదైన వరం. మీరు భౌతికంగా దూరమై ఇన్నేళ్లయినా, తెలుగువారి హృదయాల్లో సజీవంగా ఉన్న తాతయ్యా.. మీ జన్మ ధన్యమయ్యా! అని ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో కూడా నందమూరి తారక రామారావు అభిమానులు, నందమూరి ఫ్యామిలీ ఫ్యాన్స్, తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు… #NTRLivesOn ట్యాగ్ ని ట్రెండ్ చేస్తూ అన్నగారు నటించిన సూపర్ హిట్ సినిమాల వీడియోలను, ఎడిటెడ్ ఫోటోలను, గుక్క తిప్పుకోకుండా చెప్పిన డైలాగులని పోస్ట్ చేస్తూ నివాళులు అర్పించారు . అన్నా తెలుగు జాతి మరువదు నీ ఘనత అంటూ నందమూరి అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు.