Site icon NTV Telugu

Nandamuri Kalyan Ram : ‘జగత్ జజ్జరిక’ అంటున్న’బింబిసార’!

Bimbisara

Bimbisara

 

Nandamuri Kalyan Ram :యన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన టైమ్ ట్రావెల్ మూవీ ‘బింబిసార’ ట్రైలర్ బుధవారం విడుదలయింది. కళ్యాణ్ రామ్ తమ్ముడు జూనియర్ యన్టీఆర్ చేతుల మీదుగా ఈ ట్రైలర్ విడుదల కావడం విశేషం! ఇప్పటికే ‘బింబిసార’ టీజర్ తో అలరించిన కళ్యాణ్ రామ్ అదే తీరున ఈ ట్రైలర్ లోనూ అటు చరిత్రలోని బింబిసారునిగా, ఇటు ప్రస్తుత కాలంలోని బింబిసారునిగా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు.

“హద్దులు చెరిపేస్తూ మన రాజ్యపు సరిహద్దులు ఆపే రాజ్యాలను దాటి విస్తరించాలి… శరణు కోరితే ప్రాణభిక్ష… ఎదిరిస్తే మరణం…” అంటూ కళ్యాణ్ రామ్ డైలాగ్స్ తో ట్రైలర్ మొదలవుతుంది. “నాడైనా నేడైనా త్రిగర్తల చరిత్రను తాకాలంటే ఈ బింబిసారుడి కత్తిన దాటాలి…” అంటూ సాగుతుంది. చివరలో బింబిసారుని నోట “జగత్ జజ్జరిక…” అనే హెచ్చరిక తో ముగుస్తుంది. ఇందులోని డైలాగ్స్ వింటూంటే కళ్యాణ్ రామ్ బాబాయ్ బాలకృష్ణ నటించిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ గుర్తుకు రాకమానదు. అందులోని “సమయం లేదు మిత్రమా… రణమా…శరణమా…” అన్న డైలాగ్స్ ను ఈ ట్రైలర్ లోని కొన్ని మాటలు గుర్తుకు తెస్తాయి.

వశిష్ఠ దర్శకత్వంలో కె.హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎమ్.ఎమ్.కీరవాణి పాటలకు స్వరాలు అందించగా, చిరంతన్ భట్ నేపథ్య సంగీతం సమకూర్చారు. కేథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ నాయికలుగా నటించిన ఈ చిత్రం ఆగస్టు 5న ప్రేక్షకులను పలకరించబోతోంది. క్రీస్తుపూర్వం నాటి బింబిసారుని కథకు, నవీనకాలంలోని పరిస్థితులకు ముడిపెడుతూ రూపొందిన ఈ చిత్రం జనాన్ని ఏ రీతిన అలరిస్తుందో చూడాలి.

Exit mobile version