Site icon NTV Telugu

NBK107: ఫ్యాన్స్‌కి తప్పని మరింత నిరీక్షణ

Nbk107 Title Mystery

Nbk107 Title Mystery

NBK107.. సెట్స్ మీదకి వెళ్లినప్పటి నుంచి ఈ సినిమా టైటిల్ ఏంటా? అని చర్చలు కొనసాగుతున్నాయి. సాధారణంగా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేస్తున్నప్పుడు టైటిల్ అనౌన్స్ చేయడం టాలీవుడ్ ఆనవాయితీ. కాబట్టి, NBK107 ఫస్ట్ లుక్ రిలీజ్ టైంలో కచ్ఛితంగా టైటిల్ ప్రకటిస్తారని అంతా అనుకున్నారు. కానీ, మేకర్స్ అందరి ఆశలపై నీళ్లు చల్లేశారు. పవర్‌ఫుల్ పోస్టర్‌ని విడుదల చేశారే గానీ, టైటిల్ మాత్రం ప్రకటించలేదు. పోనీ, టీజర్ సమయంలో అయినా రివీల్ చేస్తారా అంటే, అప్పుడూ నిరాశే మిగిలింది. గూస్‌బంప్స్ తెప్పించే పంచ్‌లతో టీజర్ విడుదల చేశారు గానీ, టైటిల్‌ని మాత్రం రివీల్ చేయలేదు.

నిజానికి.. చాలాకాలం నుంచి ఈ సినిమాకి ‘జై బాలయ్య’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేసినట్టు వార్తలొస్తున్నాయి. దాంతో పాటు ఇతర పేర్లను కూడా పరిశీలిస్తున్నారని, కానీ ‘జై బాలయ్య’ టైటిలే దాదాపుగా ఫిక్స్ చేయొచ్చని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోస్టర్ లేదా టీజర్ టైంలో ఆ టైటిల్‌ని ప్రకటిస్తారేమోనని అంతా అనుకున్నారు. కానీ, మేకర్స్ ట్విస్ట్ ఇస్తూ ఏ టైటిలూ అనౌన్స్ చేయలేదు. బహుశా స్క్రిప్ట్ తగ్గట్టు ఏదైనా పవర్‌ఫుల్ పేరుని పరిశీలిస్తున్నారేమో, అందుకే ఇంత జాప్యం అవుతున్నట్టు అనిపిస్తోంది. ఏదేమైనా.. టైటిల్ కోసం నందమూరి అభిమానులు మరింత కాలం వెయిట్ చేయక తప్పదు.

కాగా.. బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తోన్న ఈ సినిమాలో శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ సంగీతం సమకూరుస్తోన్న ఈ సినిమాలో దునియా విజయ్ విలన్‌గా నటిస్తుండగా, వరలక్ష్మి శరత్‌కుమార్ ఓ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Exit mobile version