Naga Vamsi About Blast Zone Movie Promotions: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత నాగవంశీ తాజాగా తన నిర్మాణ సంస్థ, విడుదల చేసిన చిత్రాలు, రాబోయే ప్రాజెక్టులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అర్జున్, అభిరామి, ప్రీతి ముకుందన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘బ్లాస్ట్ జోన్’ సినిమా తెలుగు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమాకు ఊహించని కలెక్షన్స్ వచ్చాయి. తెలుగులో బ్లాస్ట్ సినిమాని నాగవంశీ విడుదల చేశారు. అయితే ఈ చిత్రంకు పెద్దగా ప్రమోషన్ చేయకపోవడానికి గల కారణాన్ని తాజాగా చెప్పారు.
‘పెద్ది’ విడుదలతో ప్రమోషన్‌కు బ్రేక్:
నాగవంశీ తాజాగా నిర్మించిన చిత్రం ‘లెనిన్’. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మాట్లాడుతూ.. బ్లాస్ట్ జోన్ చిత్రానికి సరైన స్థాయిలో ప్రచారం చేయలేకపోయామని అంగీకరించారు. ‘బ్లాస్ట్ రిలీజ్ సమయంలోనే పెద్ది సినిమా విడుదల అయింది. నేను క్రాస్ ప్రమోషన్ చేస్తే కావాలనే చేశాను అనేవారు. పెద్ది రిలీజ్ అయ్యాక చేస్తే.. సినిమాను డ్యామేజ్ చేయడానికి మైక్ పట్టుకున్నావా? అని విమర్శించేవారు. ఇవన్నీ పక్కన పెడితే.. పెద్ది నిర్మాత సతీశ్ కిలారు నాకు మంచి స్నేహితుడు. ఆయన బ్యానర్‌లో వస్తున్న తొలి సినిమాకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో నా ప్రచారాన్ని పరిమితం చేశాను’ అని నాగవంశీ వెల్లడించారు.
మరో రెండు వారాల ముందే వచ్చి ఉంటే:
బ్లాస్ట్ జోన్ సినిమా రెండు వారాల ముందే విడుదలై ఉంటే మరింతగా వసూళ్లు సాధించే అవకాశం ఉండేదని నిర్మాత నాగవంశీ అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ థియేటర్లలో మంచి స్పందన లభించిందని, ఓటీటీలో విడుదలైన తర్వాత కూడా బ్లాస్ట్ చిత్రానికి అద్భుతమైన ఆదరణ దక్కిందని తెలిపారు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో తాను సినిమా తీయాలని కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నా అని, ఎందుకో కానీ కుదరడం లేదని నాగవంశీ చెప్పుకొచ్చారు.
పాప్‌కార్నే కారణం:
సినిమా టికెట్ ధరలు పెరగడం వల్లే ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదనే అభిప్రాయాన్ని నాగవంశీ ఖండించారు. ‘టికెట్ ధరల కంటే థియేటర్లలో విక్రయించే పాప్‌కార్న్, స్నాక్స్ ధరలే ప్రేక్షకులను వెనక్కి తగ్గేలా చేస్తున్నాయి. కుటుంబంతో కలిసి సినిమా చూడాలంటే.. తినడానికే భారీగా ఖర్చు చేయాల్సి వస్తోందనే భావన చాలా మందిలో ఉంది. ప్రస్తుతం ప్రేక్షకులు రివ్యూలు లేదా రేటింగ్స్ కంటే సినిమా చూసిన వారి నుంచి వచ్చే మౌత్ టాక్’ను ఎక్కువగా నమ్ముతున్నారు. ఇటీవల విడుదలైన మా ఇంటి బంగారం సినిమానే అందుకు ఉదాహరణ. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు తీస్తే ప్రేక్షకులు తప్పకుండా థియేటర్లకు వస్తారు. స్టార్ హీరోలు కూడా ఏడాదికి కనీసం ఒక పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంలో నటించాలి’ అని నాగవంశీ కోరారు.
సిద్ధు జొన్నలగడ్డ సినిమాపై అప్డేట్:
తన రాబోయే ప్రాజెక్టులపై కూడా నాగవంశీ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డతో ఓ రూరల్ కామెడీ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రంలో హీరోకు ఓ ప్రత్యేకమైన సూపర్ నేచురల్ పవర్ ఉంటుందని, అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని అయన వెల్లడించారు. ప్రస్తుతం నాగవంశీ ‘లెనిన్’ చిత్రంతో బిజీగా ఉన్నారు. జులై 10న ఆ సినిమా విడుదల కానుంది.

