ప్రముఖ హాస్యనటుడు గౌతమ్ రాజు కుమారుడు కృష్ణ హీరోగా నటిస్తున్న సినిమా ‘నా మాటే వినవా’. నంది అవార్డు గ్రహీత వేముగంటి దర్శకత్వంలో శ్రీనివాస్ యాదవ్, పి. వినయ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో కిరణ్ చేత్వాని హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను మేకర్స్ ఇటీవలే మొదలుపెట్టారు. అందులో భాగంగా తాజాగా టీజర్‌ను విడుదల చేశారు.
‘పెళ్లి తరువాత భేదాభిప్రాయాలతో విడిపోవడం కన్నా.. పెళ్లికి ముందు మనం ఒక అండర్ స్టాండింగ్‌కు రావడం మంచిదని నా ఆలోచన’ అంటూ హీరోయిన్ చెప్పే డైలాగ్‌తో ఈ టీజర్ మొదలైంది. ఆ తర్వాత సన్నివేశాలు చూస్తే… ఇది లివ్ ఇన్ రిలేషిప్ షిప్ కు సంబంధించిన కథ అనే భావన కలుగుతోంది. టీజర్ చివరిలో హీరోహీరోయిన్ల పెళ్ళి సందర్భంగా ‘ఆధునికత మంచిదే కానీ నాగరికతను మరిచిపోకూడదు’ అంటూ సాయికుమార్ తో చెప్పించిన డైలాగ్ ఇవాళ్టి వివాహ వ్యవస్థకు సంబంధించినదని తెలుస్తోంది. దాదాపు ఎనభై సెకన్లు ఉన్న ఈ టీజర్ ను చూస్తే లవ్, రొమాన్స్, యాక్షన్, ఫ్యామిలీ సెంటిమెంట్స్ కు ఇందులో దర్శకుడు ప్రాధాన్యమిచ్చాడని అర్థమౌతోంది. యెల్లెందర్ మహవీర్ అందించిన ట్యూన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చక్కగా ఉంది. మనోహర్ కెమెరా పనితనం బాగుంది. ఈ సినిమాకు థ్రిల్లర్ మంజు సమకూర్చిన యాక్షన్ సీక్వెన్స్ హైలైట్ కాబోతోందని టీజర్ చూస్తే తెలుస్తోంది. సాయి కుమార్, పోసాని, అనంత్, జబర్దస్త్ రాఘవ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ‘నా మాటే వినవా’ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పొరెడ్డి వీరేందర్ రెడ్డి. అతి తర్వలోనే ఈ సినిమాను విడుదల చేస్తామని దర్శక నిర్మాతలు చెబుతున్నారు.