తెలుగు తెరపై నటరత్న నందమూరి తారక రామారావుకు ముందు, తరువాత ఎందరు నటులు శివుని పాత్రలో నటించినా, ఆ మూర్తిలాగా పరమశివుని పాత్రలో సరితూగిన వారు లేరు. యన్టీఆర్ తొలిసారి శివుని పాత్రలో నటించిన చిత్రం `దక్షయజ్ఙం`(1962). రామారావుకు తొలినుంచీ గురువులను, పెద్దలను గౌరవించడం అలవాటు. తనకు అనేక చిత్రాలలో తల్లిగా నటించిన కన్నాంబ అన్నా, ఆమె భర్త ప్రముఖ నిర్మాత, దర్శకులు కడారు నాగభూషణం అన్నా యన్టీఆర్ కు ఎంతో గౌరవం! వారిపై ఎంత గౌరవం అంటే, కన్నాంబ, కడారు నాగభూషణం దంపతులు కోరగా వారు నిర్మించిన `సతీ అనసూయ`(1957) చిత్రంలో కాసేపు అతిథి పాత్రలో కనిపించారు. అందులో కురూపి అయిన కౌశికుడిని అనసూయకు అత్యంత ప్రియమైన అమ్మాయి నర్మద పెళ్ళి చేసుకోవలసి వస్తుంది. అనసూయ లాగే నర్మద సైతం తన పాతివ్రత్యంతో కురూపి అయిన భర్త రోగాన్ని పోయేలా చేస్తుంది. ఆ కురూపి కౌశికుడు తరువాత అద్భుతమైన అందగాడుగా మారతాడు. కురూపి పాత్రలో సినిమా అంతా కేవీయస్ శర్మ కనిపిస్తారు. అందగాడుగా మారగానే యన్టీఆర్ తెరపై దర్శనమిస్తారు. ఆ కొద్ది నిమిషాల సేపు కనిపించే పాత్రను పోషించమని రామారావును కోరగానే మరోమాట లేకుండా అంగీకరించారు.
యన్టీఆర్. తరువాత కన్నాంబ, కడారు నాగభూషణం దంపతులు అడగగానే, వారు నిర్మించిన `దక్షయజ్ఞం`లో శివునిగా నటించారు. ఈ సినిమా అప్పట్లో జనాదరణ పొందింది. అయితే ఈ చిత్రం సమయంలో యన్టీఆర్ పెద్ద కొడుకు రామకృష్ణ మరణించాడని, అందువల్లే తరువాత రామారావు శివుని పాత్ర పోషించలేదనే కట్టు కథ మాత్రం ఈ నాటికీ సంచారం చేస్తూనే ఉంది. కరుణామయుడైన శివుడు కరుణిస్తాడే కానీ, కన్నెర్ర చేయడు కదా! ఆ తరువాత కేవీ రెడ్డి రూపొందించిన ‘ఉమాచండీగౌరీ శంకరుల కథ’లో యన్టీఆర్ మరోమారు శివుని పాత్ర పోషించారు. యన్టీఆర్ 99వ చిత్రంగా రూపొందిన ‘దక్షయజ్ఞం’ 1962 మే 10న విడుదలయింది.
‘దక్షయజ్ఞం’ చిత్రం హరకథాసంవిధానంలో ఆరంభమవుతుంది. బ్రహ్మ మానస పుత్రుడైన దక్ష ప్రజాపతిని ప్రజాపతులందరికీ నాయకునిగా నియమించి, త్రిమూర్తులు విశేషమైన వరాలు ప్రసాదిస్తారు. ఆయన పిలవగానే బ్రహ్మవిష్ణుమహేశ్వరులు తక్షణం అతని ఇంటికి వెళ్ళేవారు. దక్షుడు తన కూతుళ్ళలో 27 మందిని చంద్రునికి ఇచ్చి వివాహం చేస్తాడు. దక్షుని చిన్న కూతురు సతీదేవి, తండ్రిలాగానే పరమశివుని భక్తురాలు. శివునిపై మనసు మరలి ఆయననే తన పతిగా భావించి, ధ్యానిస్తూ ఉంటుంది. అందుకు దక్షుడు కూడా సంతోషిస్తాడు. అయితే చంద్రుడు ఒక్క రోహిణి అనే భార్యపైనే ప్రేమ కురిపిస్తూ, తక్కినవారిని అలసత్వం చేశాడని దక్షునికి తెలుస్తుంది. దాంతో చంద్రుని క్షయతో నాశనం కమ్మని శపిస్తాడు. చంద్రుడు శివుని శరణు జొచ్చి రక్షించమంటాడు. చంద్రుని రెండుగా చేసి, సగం చంద్రుని తన తలపై పెట్టుకుంటాడు శివుడు. మిగిలిన చంద్రుడు ప్రతి నెలలోనూ కృషిస్తూ, పెరుగుతూ ఉంటాడని చెబుతాడు. తన శాపానికి శివుడు అడ్డు పడి చంద్రుని రక్షించాడని ఆగ్రహిస్తాడు దక్షుడు. అప్పటి నుంచీ శివుని ద్వేషిస్తూ ఉంటాడు. సతీదేవిని కూడా మనసు మార్చుకోమంటాడు. ఆమె శివుని చేరి మనువాడుతుంది. ఆగ్రహించిన దక్షుడు శివుని మించిన శక్తులు సంపాదిస్తానని అంటాడు. అందుకుగాను ఓ యజ్ఞం తలపెడతాడు. ఆ యజ్ఞానికి శివుని తక్క అందరు దేవతలనూ ఆహ్వానిస్తాడు. తన అక్కలందరూ ఆ యజ్ఞానికి పోతున్నారని తెలిసిన సతి తానూ వెళతానంటుంది. పిలవని పేరంటానికి వెళ్ళడమెందుకు అంటాడు శివుడు. అయినా, పతిని ఒప్పించి మరీ వెళ్తుంది సతీదేవి. అక్కడ దక్షుడు ఆమెను అవమానిస్తాడు. తిరిగి భర్త దగ్గరకు వెళ్ళలేని సతీదేవి అక్కడే నిప్పురాజేసుకొని ఆహుతి అవుతుంది. ఇది తెలిసిన శివుడు ప్రళయకాల రుద్రుడై వీరభద్రుని సృష్టించి, దక్షయజ్ఞం భగ్నం చేయమంటాడు. వీరభద్రుడు దక్షుని తల నరికి, అందరు దేవతలనూ చెల్లాచెదురు చేస్తాడు. పతిని కోల్పోయిన దక్షుని ఇల్లాలు వైరిణి ఆగ్రహిస్తుంది. దాంతో ముల్లోకాలు తల్లడిల్లుతాయి. దేవతలందరూ వెళ్ళి శివుని చెంతకు చేరి రక్షించమంటారు. శివుడు ప్రసన్నుడై దక్షుని పునర్జీవితుని చేస్తాడు. మేక ముఖంతో అతని బ్రతికిస్తాడు. తరువాత మళ్ళీ పూర్వరూపం ప్రసాదిస్తాడు శివుడు. తన కూతురు సతీదేవిని కూడా పునర్జీవితురాలిని చేయమని దక్షదంపతులు కోరతారు. అయితే ఆమె మరుజన్మలో హిమవంతుని కూతురు పార్వతిగా జన్మించి, తననే వరిస్తుందని చెబుతాడు శివుడు. దాంతో ఈ కథ ముగుస్తుంది.
ఇందులో యన్టీఆర్ శివునిగా ఎంతో అందంగా కనిపిస్తారు. ముఖ్యంగా ఆరంభంలోనే పద్మాసనంలో కూర్చుని ఉన్న యన్టీఆర్ శివుని రూపం అభిమానుల మదిలో చెరగని ముద్ర వేసింది. ఈ నాటికీ శివరాత్రి సందర్భంలో ఈ సినిమాలోని యన్టీఆర్ శివుని రూపాన్నే కేలండర్స్ లో ముద్రిస్తూ ఉండడం విశేషం! ఇక రుద్రతాండవం చేసే సమయంలో శివుడుగా యన్టీఆర్ పెట్టిన భంగిమలను తరువాతి రోజుల్లో ఎంతోమంది శివుని పాత్ర పోషించిన వారు అనుకరించడం గమనార్హం. ఆ రోజుల్లో దసరా ఉత్సవాలు విశేషంగా సాగేవి. వాటిలో శివుని గెటప్ వేసిన వారందరూ ‘దక్షయజ్ఞం’లో యన్టీఆర్ భంగిమలనే అనుకరిస్తూ అలరించేవారు. ఇందులో దక్షునిగా యస్వీఆర్, సతీదేవిగా దేవిక, వైరినిగా కన్నాంబ నటించారు. మిగిలిన పాత్రల్లో చిత్తూరు వి.నాగయ్య, సూరిబాబు, మహంకాళి వెంకయ్య, రాజనాల, రామకృష్ణ, మిక్కిలినేని, పద్మనాభం, రఘురామయ్య, బాలకృష్ణ, డాక్టర్ శివరామకృష్ణయ్య, రాజశ్రీ, ఛాయాదేవి, మీనాకుమారి, వాసంతి నటించారు.
వరలక్ష్మీ పిక్చర్స్ పతాకంపై పి.కన్నాంబ సమర్పణలో రూపొందిన ‘దక్షయజ్ఞం’ చిత్రానికి సాలూరు హనుమంతరావు బాణీలు పేర్చగా, ఆరుద్ర సాహిత్యం సమకూర్చారు. కన్నాంబ భర్త కె.బి.నాగభూషణం దర్శకత్వం వహించారు. ఇందులోని “నమో నమో నటరాజా…”, “హర హర మహదేవా…”, “జాబిల్లి ఓహోహో జాబిల్లీ…”, “కోయిలా తెలుపవటే…”, “నీ పాద సంసేవ…”, “కరుణామూర్తులు…”, “మంగళం మహనీయ తేజ…” అంటూ సాగే పాటలు ఆకట్టుకున్నాయి. ‘దక్షయజ్ఞం’ చిత్రం భక్తజనాన్ని విశేషంగా ఆకట్టుకుంది. రిపీట్ రన్స్ లో మరింతగా అలరించింది. యన్టీఆర్ 99వ చిత్రంగా ‘దక్షయజ్ఙం’ విడుదలయింది. తరువాత ఆయన 100వ చిత్రంగా ‘గుండమ్మ కథ’ జనం ముందు నిలచి వారి మనసులు గెలిచింది.