NTR 30: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తరువాత కొరటాల శివ దర్శకత్వంలో NTR30 చేస్తున్న విషయం విదితమే. ఈపాటికే సెట్స్ మీదకు వెళ్లాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల ఇంకా లేట్ అవుతూ వస్తుంది. ఇక స్క్రిప్ట్ విషయంలో ఎంతో పకడ్బందీగా ఉన్న శివ కొరటాల.. హీరోయిన్ విషయంలో కూడా అంతే జాగ్రత్తలు తీసుకొంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హీరోయిన్లు నటిస్తున్నారని వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. జాన్వీ కపూర్, శ్రద్దా కపూర్, దీపికా పదుకొనే అంటూ ఏవేవో పేర్లు వినిపిస్తున్నాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదని, వీరెవరిని చిత్ర బృందం సంప్రదించలేదని ఇండస్ట్రీ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. కాగా తాజాగా ఇంకో ముద్దుగుమ్మ పేరు తెరపైకి వచ్చింది.
సీతారామం చిత్రంతో టాలీవుడ్ సీతగా మారిపోయింది బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. ఈ సినిమా విజయం తరువాత వరుస అవకాశాలను అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ NTR30 లో ఛాన్స్ కొట్టేసిందని టాక్ నడుస్తోంది. సీత లుక్ లో శివ కొరటాలకు మృణాల్ నచ్చడంతో ఎన్టీఆర్ సరసన బావుంటుందని భావించి మృణాల్ ను సంప్రదించినట్లు సమాచారం. ఇక ఒక ఇంటర్వ్యూలో తారక్ తో కలిసి నటించాలని మృణాల్ కూడా చెప్పుకొచ్చింది. దీంతో కథ వినకుండానే అమ్మడు ఓకే చెప్పిందని వార్తలు గుప్పుమంటున్నాయి. ఒకవేళ ఇదే కనుక నిజమైతే తారకరాముడి సరసన సీత సెట్ అయిపోయినట్లే అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఈ వార్తపై మేకర్స్ ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.