లోటస్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై మధుదీప్ సి.హెచ్. ను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. సాఫ్ట్వేర్ టర్నెడ్ ఇంజినీర్ అరవింద్ ఎమ్ నిర్మిస్తున్న విభిన్న కథాచిత్రం ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’. త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్ ను బుధవారం హీరో బర్త్ డే సందర్భంగా విడుదల చేశారు. ఈ మోషన్ పోస్టర్ కు తనికెళ్ళ భరణి వాయిస్ ఓవర్ అందించడం విశేషం. ముందు తరం ప్రకృతిని దేవుడిలా భావించి పూజిస్తే నేటి తరం ప్రకృతిని ఇష్టానుసారం వాడుకుని నాశం చేసింది. ఇప్పుడు ఆ ప్రకృతి ఆగ్రహానికి భయపడి రక్షించమంటూ వేడుకుంటోంది. ఇదే కాన్సెప్ట్ తో ఆ మోషన్ పోస్టర్ రూపుదిద్దుకుంది. ఇదిలా ఉంటే ఇటీవల ‘వెన్నెలే వెన్నెలే నాలో వెల్లువై పొంగెలే నిన్నలో మొన్నలో లేని వన్నెలే పూచెలే’ అనే పల్లవితో సాగే సాంగ్ ను లాంచ్ చేశారు. ఈ పాటకు అనూహ్యమైన స్పందన లభిస్తోందని నిర్మాత అరవింద్ తెలిపారు. ‘అరుణ్ చిలువేరు సంగీత సారధ్యంలో రూపొందిన ఈ పాటకు ప్రముఖ గీత రచయిత చైతన్య ప్రసాద్ సాహిత్యం సమకూర్చగా ఎన్.సి. కారుణ్య ఆలపించారని, రుచులలో రారాజు ఆవకాయలాంటి మాధుర్యాన్ని పంచగలిగే ఛందస్సును గుర్తుచేస్తూ, పద సంయోగపు మధురిమలను పంచే ప్రయత్నమే ఈ పాట’ అని అన్నారు అరవింద్. పాటకు లభించిన మిలియన్ వ్యూస్ తమ హీరోకు బర్త్ డే కానుకగా అందిస్తున్నామని దర్శకుడు మధుదీప్ పేర్కొన్నారు.