నెట్ ఫ్లిక్స్ లోని పాపులర్ స్పానిష్ వెబ్ సీరిస్ ‘ది మనీ హేస్ట్’ ఐదవ, చివరి సీజన్ సెప్టెంబర్ 3న టెలీకాస్ట్ కాబోతోంది. భారతీయ భాషల్లో హిందీ, తమిళ, తెలుగులోనూ ఇది డబ్ కానుంది. సోమవారం నెట్ ఫ్లిక్స్ ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా ‘జల్దీ ఆవో’ అంటూ ఓ మ్యూజిక్ వీడియోను విడుదల చేసింది. న్యూక్లియా దీనిని స్వరపరిచాడు. భారతీయ సినిమా రంగానికి చెందిన ప్రముఖ నటీనటులపై దీనిని చిత్రీకరించడం విశేషం. అనిల్ కపూర్, రానా, శ్రుతీహాసన్, విక్రాంత్ మస్సే, రాధికా ఆప్టే, క్రికెటర్ హార్థిక్ పాండే తదితరులు ఈ మ్యూజిక్ వీడియో నటించారు.
విశేషం ఏమంటే… వీరంతా ‘మనీ హేస్ట్’లోని పాత్రలను ఈ వీడియోతో గుర్తు చేసే ప్రయత్నం చేశారు. ఈ షోలోని దెవ్ వీర్ తరహాలో కరెన్సీ బెడ్ పై అనిల్ కపూర్ పవళిస్తే, రానా తెలుగు పదాలకు లిప్ సింగ్ ఇచ్చాడు. ఇక శ్రుతీ హాసన్ నైరోబీ తరహాలో తమిళ పదాలను బెడ్ పై పడుకుని, పెదాలపై పువ్వును ఉంచుకుని ఉచ్చరించింది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సామాన్యజనం కూడా ‘మనీ హేస్ట్’ కోసం ఎంతలా ఎదురుచూస్తున్నారో ఈ వీడియో ద్వారా తెలియచేసే ప్రయత్నం చేశారు. మరి భారతీయ భాషల్లోనూ చూసే అవకాశం ఉన్న ఈ క్రైమ్ డ్రామాకు ఈసారి ఏ స్థాయి ఆదరణ లభిస్తుందో చూడాలి.
