Site icon NTV Telugu

Bheemla Nayak: ప్రి రిలీజ్ ఈవెంట్ వేదికపై మొగులయ్యకు సత్కారం

హైదరాబాద్‌లో భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరుగుతోంది. ఈ సినిమాలో పాట పాడిన మొగులయ్యకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. ఈ నేపథ్యంలో మొగులయ్యను వేదికపై చిత్ర యూనిట్ సన్మానించింది. భీమ్లానాయక్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ, సంగీత దర్శకుడు తమన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మొగులయ్య మాట్లాడుతూ.. భీమ్లానాయక్ సినిమాలో తాను పాట పాడటం తన అదృష్టమని పేర్కొన్నారు. ఈ సినిమాలో తాను పాట పాడకపోతే తానెవరో ఎవరికీ తెలిసేది కాదన్నారు. ఇంత మంచి పేరు కూడా వచ్చుండేది కాదని అభిప్రాయపడ్డారు.

భీమ్లానాయక్ సినిమాలో పాట పాడిన త‌రువాత తనకు ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌న్మానం చేసి ల‌క్ష రూపాయ‌లు న‌గ‌దు ఇచ్చారని మొగులయ్య వెల్లడించారు. మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఇల్లు ఇచ్చి స‌న్మానం చేసి రూ.కోటి సాయం అందించార‌ని పేర్కొన్నారు. ఈ సినిమాలో పాట పాడిన త‌రువాతే ఢిల్లీలో నాకు ప‌ద్మశ్రీ అవార్డు వ‌చ్చిందన్నారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా తనతో అంద‌రూ సెల్పీలు దిగుతున్నారని.. తాను ఇంత పాపులారిటీ కావడానికి భీమ్లానాయక్‌లో పాట పాడటమే కారణమన్నారు. తాను కొన్ని తప్పులు చేసినా తమన్ తనతో పాట పాడించార‌ని చెప్పారు. ఈ సినిమాలో టైటిల్ పాట వింటే రోమాలు నిక్కబొడుచుకుంటాయని పేర్కొన్నారు. తన పాటలపై శ్రీను అనే విద్యార్థి పీహెచ్డీ చేస్తున్నట్లు తెలిపారు. తనకు గుర్తింపు వచ్చేలా చేసిన పవన్ కళ్యాణ్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌కు కృతజ్ఞతలు చెబుతున్నట్లు మొగులయ్య పేర్కొన్నారు.

https://www.youtube.com/watch?v=v97rAjyN_hQ
Exit mobile version