Site icon NTV Telugu

ఏపీలో థియేటర్ల సమస్యపై మాట్లాడతా… – మంత్రి తలసాని

Talasani-srinivas-yadav

ఏపీలో థియేటర్ల సమస్య ఇంకా కొనసాగుతోంది. తాజాగా ఈ విషయంపై మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమపై తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని తాజాగా చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. తలసాని మాట్లాడుతూ “అఖండ, పుష్ప చిత్రాలతో సినీ పరిశ్రమ పుంజుకుంది. తెలంగాణలో టికెట్ ధరలు పెంచాం. ఐదో ఆటకు అనుమతి ఇచ్చాం… సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుంది. సినీ పరిశ్రమకు హైదరాబాద్ హబ్ గా ఉండాలన్నది ముఖ్యమంత్రి ఆకాంక్ష. సినిమాకు కులం, మతం, ప్రాంతాలు ఉండవు. సినిమా ప్రజలకు వినోదాన్ని అందించే సాధనమే. సినీ పరిశ్రమలోని సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వం సత్వరమే స్పందిస్తుంది. హైదరాబాద్ లో సినీ పరిశ్రమపై ఆధారపడి వేలాది మంది జీవిస్తున్నారు. తెలంగాణలో ప్రభుత్వం సినీ పరిశ్రమపై బలవంతంగా నిర్ణయాలు తీసుకోదు. సందర్భాన్ని బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. తెలంగాణలో సినిమా థియేటర్లపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. ఏపీలో థియేటర్ల సమస్యపై నేను ఆ రాష్ట్ర మంత్రులతో మాట్లాడుతా” అని చెప్పుకొచ్చారు.

Read Also : ఇంకా ఐసీయూలోనే లతా మంగేష్కర్… తాజా హెల్త్ అప్డేట్

ఇప్పటికే ఎంతోమంది ప్రముఖులు ఈ విషయంపై ఏపీ ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలయత్నాలుగానే మిగిలాయి. తాజాగా సినిమా టికెట్ రేట్ల విషయంపై ఆర్జీవీ కూడా పేర్ని నానితో భేటీ అయ్యారు. ఆ మీటింగ్ లో కూడా తేలిందేమీ లేదు. మరోవైపు ప్రభుత్వం వేసిన కమిటీ ఇచ్చే నివేదికపై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో తలసాని చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మరి ఏపీ మంత్రులతో తలసాని చర్చలు ఎప్పుడు జరుగుతాయి ? అనేది చూడాలి.

Exit mobile version