NTV Telugu Site icon

అన్నా…. ఆ వెనుకే తమ్ముడు!!

గత యేడాది కరోనా ఫస్ట్ వేవ్ తగ్గుముఖం పట్టి, థియేటర్లు ఓపెన్ గానే వచ్చిన మొదటి పెద్ద సినిమా సాయిధరమ్ తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’. ఆ మూవీ సూపర్ హిట్ కాకపోయినా… జనాలు థియేటర్ల వరకూ ధైర్యంగా వెళ్ళడానికి కారణమైంది. దాంతో జనవరిలో వచ్చిన సినిమాలతో థియేటర్లు కళకళలాడాయి. విశేషం ఏమంటే… ‘సోలో బ్రతుకే సో బెటర్’ మూవీని టాలీవుడ్ హీరోలంతా తమ సినిమా అన్నట్టు ఓన్ చేసుకుని ప్రచారం చేశారు. ఇక ఈ యేడాది ఫిబ్రవరిలో సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ నటించిన తొలి చిత్రం ‘ఉప్పెన’ విడుదలైంది. సుకుమార్ శిష్యుడు సానా బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాను మెగా స్టార్ చిరంజీవితో మొదలు పెట్టి మెగా ఫ్యాన్స్ అంతా భుజానకెత్తుకుని ప్రచారం చేశారు. దాంతో తొలి చిత్రంతోనే వైష్ణవ్ తేజ్ రికార్డులను నమోదు చేసుకున్నాడు. విశేషం ఏమంటే.. ఈ యేడాది ద్వితీయార్థంలో ఈ అన్నదమ్ముల ఇద్దరి సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రాబోతున్నాయి.

సాయిధరమ్ తేజ్ నటించిన పొలిటికల్ అండ్ బ్యూరోక్రాట్ డ్రామా ‘రిపబ్లిక్’. ఇందులో పంజా అభిరామ్ అనే ఐఎఎస్ పాత్రను సాయితేజ్ పోషించాడు. తన కెరీర్ లోనే మనసుకు ఎంతో దగ్గరైన పాత్ర ఇదని సాయితేజ్ చెబుతున్నాడు. ఈ మూవీ అక్టోబర్ 1న గాంధీ జయంతి సందర్భంగా విడుదల కాబోతోంది. కెరీర్ ప్రారంభంలోనే ‘ప్రస్థానం’ వంటి పొలిటికల్ మూవీని తెరకెక్కించిన దేవా కట్ట ఈ సినిమాను ప్రతిష్ఠాత్మకగా రూపొందించాడు. ఇక సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ నటించిన రెండో సినిమా ‘కొండపొలం’ను ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేశాడు. ప్రముఖ రచయిత అన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల ఈ సినిమాకు ఆధారం. క్రిష్‌ సొంత బ్యానర్ లో నిర్మితమైన ఈ సినిమా అక్టోబర్ 8న విడుదల కాబోతోంది. రకుల్ ఈ మూవీలో నాయికగా నటించింది. ఆలోచనాత్మక కథాంశాలతో తెరకెక్కిన ఈ రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రావడం ఓ విశేషం అయితే… మెగా కాంపౌండ్ లోని ఇద్దరు అన్నదమ్ముల సినిమాలు ఇలా రావడం మరో విశేషం.