వీజే గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత పలు పాపులర్ షోస్ ను నిర్వహించాడు ఓంకార్. అంతేకాదు… ఓక్ ఎంటర్ టైన్మెంట్స్ పేరుతో సొంత ప్రొడక్షన్ హౌస్ నూ ఏర్పాటు చేశాడు. ఓంకార్ నిర్వహించిన ఆట, ఛాలెంజ్, అదృష్టం, సిక్స్త్ సెన్స్ వంటి కార్యక్రమాలు అతనికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఈ మధ్యలో దర్శక నిర్మాతగానూ ఓంకార్ కొన్ని సినిమాలను తెరకెక్కించాడు. అయితే… ఓంకార్ నిర్వహించిన కిడ్స్ రియాలిటీ షో ‘మాయాద్వీపం’ అతని కెరీర్ లోనే సమ్ థింగ్ స్పెషల్! పిల్లలను ఆకట్టుకోవడంతో పాటు పెద్దలనూ ఎంటర్ టైన్ చేసేలా ఆ రియాలిటీ షో సాగింది.
2007లో మొదలైన ‘మాయా ద్వీపం’ రియాలిటీ షో… తొలిసారి మూడేళ్ళు, ఆ తర్వాత కొంత గ్యాప్ తర్వాత రెండేళ్ళు కొనసాగింది. ఇప్పుడు ఆ సూపర్ హిట్ రియాలిటీ షోను మరోసారి ఈ తరం బాలబాలికల కోసం తీసుకొస్తున్నారు ఓంకార్. జీ తెలుగులో ప్రసారం కాబోతున్న ఈ షో కు సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదలైంది. అద్భుత దీపం కోసం కొందరు పిల్లలు ఓ పురాతన భవనంలోకి వెళతాడు. భయంకరమైన ఆ భవనంలో వారికి ఓ డిఫరెంట్ గెటప్ లో ఓంకార్ కనిపిస్తాడు. ‘అద్భుత దీపం’ కోసం వెతకాల్సింది ఇక్కడ కాదని ‘మాయద్వీపం’లో అని చెబుతాడు. సో… ఈ పిల్లలంతా ఆ ‘మాయాద్వీపం’ లోకి వెళ్ళి, అక్కడ ఎలా అద్భుత దీపం ను పొందారన్నదే ఈ షో కాన్సెప్ట్ అనేది చెప్పకనే చెప్పేశారు. ఈ షో టెలికాస్ట్ డేట్ ను ప్రకటించాల్సి ఉంది. ఇటీవలే ‘సిక్త్స్ సెన్స్’తో బుల్లితెర వీక్షకులను మరోసారి తనవైపు తిప్పుకున్న ఓంకార్… ఈ ‘మాయాద్వీపం’తో చిన్నారులనూ ఆకట్టుకునే పనిలో పడ్డాడు!