Margot Robbie On Physical Harassment: మూడేళ్ళ క్రితం జనం ముందు నిలచిన హాలీవుడ్ మూవీ ‘బాంబ్‌షెల్’ సినిమా చూసిన వారికి అందులో పడచు అందాలతో పరవశింప చేసిన నటి మార్గట్ రాబీ గుర్తుండే ఉంటుంది. ఈ 32 ఏళ్ళ ఆస్ట్రేలియన్ భామకు ‘బాంబ్‌షెల్’లో నటించే వరకూ ‘సెక్సువల్ హెరాస్‌మెంట్’ అంటే ఏంటో తెలియదట! ఈ విషయాన్ని ఇటీవల వరైటీ మేగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మార్గట్ రాబీ తెలిపింది. అది చదివిన వారికి అమ్మడిది అమాయకత్వం అనుకోవాలో, ఆమె అబద్ధాలకోరు అని భావించాలో అర్థం కావడం లేదట!
‘బాంబ్‌షెల్’ సినిమా కథనే ‘ఫాక్స్ న్యూస్’ సంస్థకు సిఈవోగా పనిచేసిన రోజర్ ఎయిల్స్ తన దగ్గర పనిచేసే మహిళలను ఎలా సెక్సువల్ హెరాస్‌మెంట్‌కు గురి చేశాడు అన్న అంశం చుట్టూ తిరుగుతుంది. చివరకు అతడిని కొందరమ్మాయిలు ఓ పథకం ప్రకారం ఎలా ఇరికించారు అని కథ సాగుతుంది. ఇందులో కేలా పాస్పిసిల్ పాత్రలో మార్గట్ రాబీ నటించింది. మిగిలిన భామలు చార్లీజ్ థెరాన్, నికోల్ కిడ్మన్ కంటే వయసులో ఎంతో చిన్నదైన మార్గట్ అందాలు జనాన్ని బాగానే ఆకర్షించాయి. ఈ సినిమా ఇట్టే అలరించలేకపోయినా, మార్గట్ అందాలు మాత్రం కుర్రకారుకు బంధాలు వేశాయి. అలాంటి ముద్దుగుమ్మ నోటి నుండి ‘సెక్సువల్ హెరాస్‌మెంట్’ అన్న మాటకు అర్థమే తెలియదని రావడం ఆమె ఫ్యాన్స్‌కు ఆశ్చర్యం కలిగిస్తోంది.
‘బాంబ్‌షెల్’లో తన పాత్రను ఎలాంటి ఇబ్బంది లేకుండా పోషించడానికి ‘సెక్సువల్ హెరాస్‌మెంట్’ అన్నపదానికి సరైన అర్థం తెలియకపోవడమూ ఓ కారణమని చెబుతోంది మార్గట్. అందువల్లే దర్శకుడు జే రోచ్ తనకు కావలసిన నటనను తన నుండి రాబట్టుకోగలిగాడనీ అంటోంది. అంతేకాదు, నిజ జీవితంలో తాను ఎంతటి బాధనైనా నవ్వుతూ భరించే అలవాటు ఉన్నదానినని, ఆ కారణంగానూ తన పాత్ర పండిందని చెబుతోంది. జనం మాత్రం “అమ్మడు… ఏమి వగలు పోతోంది…” అని ముక్కున వేలేసుకుంటున్నారు.