తెలుగు సినీ అభిమానులే కాదు… యావత్ భారతదేశంలోని సినిమా అభిమానులు మార్చి నెల కోసం ఎంతగానో ఎదురుచూశారు. కొన్నేళ్ళుగా వాళ్లు భారీ ఆశలు పెట్టుకున్న పాన్ ఇండియా సినిమాలు ఈ నెలలో విడుదల కాబోతుండమే అందుకు కారణం. అయితే కారణాలు ఏవైనా ఆ సినిమాలు వారిని తీవ్ర నిరాశకు గురిచేశాయి. మార్చి నెలలో తెలుగులో మొత్తం 18 సినిమాలు విడుదలయ్యాయి. అందులో స్ట్రయిట్ సినిమాలు 13 కాగా, 5 డబ్బింగ్ మూవీస్. ఈ నెల ప్రారంభమే తమిళ అనువాద చిత్రం ‘హే సినామిక’తో మొదలైంది. ప్రముఖ నృత్య దర్శకురాలు బృంద తొలిసారి దర్శకత్వం వహించిన ‘హే సినామిక’ వివిధ భాషల్లో మార్చి 3న జనం ముందుకు వచ్చింది. దుల్కర్ సల్మాన్, కాజల్, అదితిరావ్ హైదరీ ఇందులో కీలక పాత్రలు పోషించారు. సంగీతం, సినిమాటోగ్రఫీ, కొరియోగ్రఫీ వంటివి జనాలను ఆకట్టుకున్నా, కథ మరీ పాత చింతకాయ పచ్చడిలా ఉండటంతో దీన్ని ప్రేక్షకులు తిరస్కరించారు. ఇక ఆ మర్నాడే జనం ముందుకు నాలుగు సినిమాలు వచ్చాయి. అందులో చెప్పుకోదగ్గది శర్వానంద్, రశ్మిక మందణ్ణ నటించిన ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’. మూవీ విడుదలకు ముందు పాజిటివ్ బజ్ ఏర్పడినా, దాన్ని దర్శకుడు కిశోర్ తిరుమల నిలబెట్టు కోలేకపోయాడు. వరుస పరాజయాలతో ప్రయాణం సాగిస్తున్న శర్వానంద్ ఖాతాలో మరో ఫ్లాప్ మూవీగా ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ చేరిపోయింది. అలానే ‘రాజావారు రాణిగారు’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరంకు ఆ తర్వాత వచ్చిన ‘ఎస్. ఆర్. కళ్యాణ మండపం’ మంచి విజయాన్ని అందించింది. కానీ చిత్రంగా అతని మూడో సినిమా ‘సెబాస్టియన్ పీసీ 524’ బాక్సాఫీస్ దగ్గర చతికిల పడింది. ఇదే వారం ‘శ్రీ ధర్మవ్యాధుడి చరిత్ర’తో పాటు అనువాద చిత్రం ‘ద బ్యాట్ మ్యాన్’ కూడా విడుదలైంది.
Read Also : Ajith : కేరళ టెంపుల్ లో స్టార్ హీరో ప్రత్యేక పూజలు
మార్చి సెకండ్ వీకెండ్ మూడు ఓటీటీ చిత్రాలతో కలిసి ఏకంగా ఐదు సినిమాలు జనం ముందుకు వచ్చాయి. ఇందులో రెండు పాన్ ఇండియా మూవీస్ కావడం విశేషం. సూర్య నటించిన ‘ఈటీ’ మూవీ మార్చి 10న విడుదలైంది. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా సూర్య అభిమానులను సైతం మెప్పించలేకపోయింది. అదే రోజు అరవింద్ కృష్ణ, పూనమ్ కౌర్ ప్రధాన పాత్రధారులుగా నాగు గవర తెరకెక్కించిన ‘నాతి చరామి’ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. ఇక ప్రభాస్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. టెక్నికల్ గా సినిమా సూపర్ గా ఉందని, పాటలను బాగా చిత్రీకరించారని అందరూ చెప్పుకున్నా, కథలో బలం లేకపోవడంతో ‘జిల్’ రాధాకృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా జనాలను ఆకట్టుకోలేదు. అలానే అదే రోజున ధనుష్ నటించిన ‘మారన్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. ఈ సిస్టర్ సెంటిమెంట్ మూవీ చూసి జనాలు పెదవి విరిచారు.
మార్చి థర్డ్ వీకెండ్ లో స్వర్గీయ పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి చిత్రం ‘జేమ్స్’ రిలీజైంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో పునీత్ కన్నుమూయడంతో దర్శక నిర్మాతలు కొన్ని ఇబ్బందులను అధిగమించి సినిమా పూర్తి చేసి పునీత్ జయంతి సందర్భంగా మార్చి 17న విడుదల చేశారు. రొటీన్ కథాంశాంతో తెరకెక్కిన యాక్షన్ మూవీ ‘జేమ్స్’ జనాలను ఆకట్టుకోలేకపోయింది. అదే వారం రాజ తరుణ్, వర్ష బొల్లమ్మ నటించిన ‘స్టాండప్ రాహుల్’, అమిత్ తివారి ‘నల్లమల’, సునీల్ కుమార్ రెడ్డి డైరెక్ట్ చేసిన ’69 సంస్కార్ కాలనీ’, ‘సంహారి’, ‘డైరెక్టర్’ సినిమాలు విడుదలయ్యాయి. కానీ ఇందులో ఏ ఒక్కటి నిలదొక్కుకోలేదు.
మార్చి చివరి శుక్రవారం జనం ముందుకు వచ్చింది మాగ్నమ్ ఓపస్ మూవీ ‘ట్రిపుల్ ఆర్’. ఎన్టీయార్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ రియల్ మల్టీ స్టారర్ మూవీకి అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చాయి. కొన్ని ప్రాంతాలలో ఇది ‘బహుబలి -2’ రికార్డులను సైతం క్రాస్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నటీనటులు, సాంకేతిక నిపుణులకు ‘ఆర్.ఆర్.ఆర్.’ మూవీ మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ‘కె.జి.ఎఫ్2’ వరకూ వేరే పెద్ద సినిమా ఏదీ లేకపోవడం కమర్షియల్ గా మరింతగా కలసి వచ్చే అంశం. ఓవర్ ఆల్ గా మార్చిలో దక్షిణాది నుండి వెలువడిన పాన్ ఇండియా మూవీస్ ప్రేక్షకులకు సంపూర్ణమైన ఆనందాన్ని ఇవ్వలేకపోయాయి. మరి ఈ సినిమాల ఫలితాలు నేర్పిన పాఠాలతో రాబోయే రోజుల్లో మరింత బెటర్ మూవీస్ వస్తాయా లేదా అన్నది పక్కన పెడితే మార్చి మాత్రం ‘ఆర్ఆర్ఆర్’దే అని చెప్పవచ్చు.