ప్రతిష్ఠాత్మక చిత్రం ‘పొన్నియన్ సెల్వన్ -1’ విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్ది ఆ ప్రాజెక్ట్ కు సినిమా కష్టాలు మొదలవుతున్నాయి. సెప్టెంబర్ 30న వివిధ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ‘పీఎస్ -1’ను విడుదల చేయడానికి దర్శకుడు మణిరత్నం సర్వసన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం విగరస్ గా ప్రమోషన్స్ జరుగుతున్నాయి. దానితో పాటే పోస్ట్ ప్రొడక్షన్ పనులూ శరవేగంగా సాగుతున్నాయి. ఈ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొనాలని భావించిన కథానాయకుడు విక్రమ్ హఠాత్తుగా గుండె నొప్పితో ఆ మధ్య హాస్పిల్ లో చేరాడు. ఆ తర్వాత ఒకటి రొండు రోజులకు ఇంటికి వచ్చాడు. ఇప్పుడు మణిరత్నం సైతం అలాంటి సమస్యనే ఎదుర్కొంటున్నారు. అయితే ఆయనకు వచ్చింది గుండెపోటు కాదు…. కరోనా పాజిటివ్! ఈ మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా కరోనా కలకలం మళ్ళీ మొదలైంది. ముఖ్యంగా తమిళనాడులోని సినీ, రాజకీయ నాయకులు కరోనా బారిన పడుతున్నారు. మొన్నటికి మొన్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కు కరోనా వచ్చింది. అలానే ప్రముఖ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ సైతం కరోనా బారిన పడింది. ఇప్పుడు మణిరత్నం వంతు! మామూలుగానే మణిరత్నం ఆరోగ్యం అంతంత మాత్రం. ఆయన అనేకసార్లు గుండెపోటుతో ఇబ్బంది పడ్డారు. అందుకే కుటుంబ సభ్యులు వెంటనే మణిరత్నంను చెన్నయ్ లోని అపోలో హాస్పిటల్ లో చేర్చి కరోనాకు చికిత్స చేయిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిమితంగానే ఉందని, కంగారు పడాల్సిందేమీ లేదని అక్కడి వైద్యులు తెలిపారు.