మంచు ఫ్యామిలీ ఇటీవల ఒక వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.. హెయిర్ డ్రస్సర్ నాగ శ్రీనుపై తప్పుడు కేసు పెట్టి అతడిని ఇరికించారని మంచు ఫ్యామిలీని నెటిజన్స్ దుమ్మెత్తిపోస్తున్నారు. ఇక మరోపక్క నాయీ బ్రాహ్మణ కులాన్ని దూషించినందుకు మోహన్ బాబు, విష్ణు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని నాయీ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు రామకృష్ణ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ విషయాలపై ఇప్పటివరకు మంచు ఫ్యామిలీ నోరుమెదిపింది లేదు. దీంతో ఈ వివాదం చల్లారిపోతుంది అనుకొనేలోపు మెగా బ్రదర్ నాగబాబు అగ్గిరాజేశారు. మా ఎలక్షన్స్ అప్పటినుంచి మెగా ఫ్యామిలీకి, మంచు ఫ్యామిలీకి మధ్య కోల్డ్ వార్ సాగుతున్న విషయం తెలిసిందే. ఎన్నోసార్లు నాగబాబు బాహాటంగానే మోహన్ బాబు క్యారెక్టర్ ఇది అంటూ తెలిపారు. ఇక తాజగా మోహన్ బాబు తిట్టి, కేసుపెట్టిన హెయిర్ డ్రస్సర్ నాగ శ్రీనుకు, నాగబాబు చేయూతనిచ్చారు.
మంచు ఫ్యామిలీ నుండి ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెబుతున్న నాగ శ్రీను రూ. 50 వేలు ఆర్ధిక సాయం అందించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తన ఆఫీస్ కి వచ్చిన నాగశ్రీనును పలకరించి, అతని తల్లి ఆరోగ్యం గురించి ఆరా తీశారు. అంతేకాకుండా నాగశ్రీను పిల్లల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని వారికి ఎటువంటి సమస్య లేకుండా పూర్తి వైద్య సహాయం కోసం అపోలో ఆసుపత్రి సహకారంతో మెడికల్ చెకప్ చేయించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారయి. చల్లారిపోతున్న వివాదంలో ఆజ్యం పోసినట్లు నాగబాబు ఇప్పుడు నాగశ్రీను కు సాయం చేయడంపై పలు అనుమానాలకు దారి తీస్తున్నాయి. మరి ఈసారైనా మంచు ఫ్యామిలీ స్పందిస్తుందా..? లేదా చూడాలి.
