ప్రముఖ మలయాళీ దర్శకుడు అలీ అక్బర్ కేరళ సెన్సార్ బోర్డ్ మీద, ముంబైలోని కేంద్ర సెన్సార్ బోర్డ్ మీద గుస్సా అవుతున్నాడు. తాను మలయాళంలో తెరకెక్కించిన ‘పుళ ముత్తల్ పుళ వారె’ చిత్రాన్ని జనం ముందుకు తీసుకు రానీయకుండా సెన్సార్ బోర్డ్ అడ్డుకుంటోందని వాపోతున్నాడు. అయితే అలీ అక్బర్ ఆరోపణల వెనుక చాలా ఆసక్తికరమైన కథ ఉంది. 1921లో ఖిలాఫత్ ఉద్యమ సమయంలో మలబార్ ప్రాంతంలో హిందువుల మీద ముస్లింలు దాడులకు తెగబడ్డారు. అనేక మంది హిందువులను మత మార్చారు, అందుకు అంగీకరించని వారిని హతమార్చారు. దీనిపైనే ‘పుళ ముత్తల్ పుళ వారె’ చిత్రాన్ని అలీ అక్బర్ తెరకెక్కించాడు. అయితే ఆయన ఓ ముస్లింగా ఈ సినిమాను తీయలేదు. కొంతకాలం క్రితం అతను హిందువుగా మారాడు. తన పేరును రామ సింహన్ గా మార్చుకున్నాడు. కేరళలో కొన్ని దశాబ్దాలకు పైగా ముస్లింలు హిందువులను హింసిస్తున్నారన్నది ఆయన వాదన. కేరళలోని ప్రభుత్వం అండతో హిందువులను కించపరుస్తూ, ముస్లింలను, క్రైస్తవులను ఆకాశానికి ఎత్తుతూ ఎన్నో సినిమాలు వచ్చాయని, వాటికి సెన్సార్ వారు ఎలాంటి అభ్యంతరం పెట్టలేదని, కానీ తన చిత్రం దగ్గరకు వచ్చేసరికీ అసలు సర్టిఫికెట్ ఇవ్వడానికే నిరాకరించారని అలీ అక్బర్ ఆరోపిస్తున్నాడు.

కేరళలోని ప్రాంతీయ సెన్సార్ బోర్డ్ సభ్యులు కొన్ని కట్స్ తో తన సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వవచ్చని అన్నారని, కానీ రీజనల్ ఆఫీసర్ పార్వతి సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించారని అలీ అక్బర్ తెలిపారు. ఆమెకు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వంతో సత్ సంబంధాలు ఉన్నాయని, అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా ఆమె పదవీకాలం పూర్తి అయినా ఇంకా మార్చలేదని విమర్శించారు. ఇక కేరళలో ప్రస్తుతం రివైజింగ్ కమిటీ లేదని, దానికి ఛైర్మన్ గా ఉన్న షాజీ ఎన్ కరణ్, మోదీ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడిన తర్వాత తన పదవికి రాజీనామా చేశారని, ఆ స్థానంలో వేరెవరినీ నియమించలేదని తెలిపారు. ఎన్నో ఆశలతో ముంబైలోని సెన్సార్ బోర్డ్ కు వెళ్ళినా అక్కడ కూడా కుహనా మేధావులతో కూడిన కమిటీ తన సినిమాకు అనేక కట్స్ ఇచ్చిందని, వాటన్నింటినీ తొలగిస్తే… సినిమా ఆత్మ పోతుందని అలీ అక్బర్ వాపోయాడు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నా సెన్సార్ బోర్డ్ లో మాత్రం హిందూవ్యతిరేక శక్తులదే పైచేయిగా ఉందని, ఈ దేశంలో స్వతంత్య్రానికి పూర్వం హిందువులకు జరిగిన అన్యాయాలను ప్రజలకు తెలియచేద్దామంటే సెన్సార్ బోర్డ్ సహకరించడం లేదని తెలిపాడు. మరి అలీ అక్బర్ అలియాస్ రామ సింహన్ కు ఎప్పుడు న్యాయం జరుగుతుందో వేచి చూడాలి. ఒక రకంగా చూస్తే…. కశ్మీర్ లో హిందువులపై జరిగిన మారణకాండ నేపథ్యంలో వచ్చిన ‘ది కశ్మీర్ ఫైల్స్’కు సెన్సార్ సర్టిఫికెట్ లభించడం అదృష్టమనే చెప్పాలి!