అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజును ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు ఆయన అభిమానులు. ఈ సందర్భంగా ప్రభాస్ కు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రముఖ సెలబ్రిటీలంతా సోషల్ మీడియాలో ట్వీట్లు చేశారు. అలాగే ఆయన నటిస్తున్న హై బడ్జెట్ పాన్ ఇంటర్నేషనల్ ప్రాజెక్టులకు సంబంధించిన అప్డేట్స్ కూడా ఇచ్చారు. అందులో ‘రాధేశ్యామ్’ టీజర్ రికార్డులు సృష్టిస్తోంది. ఇక ప్రభాస్ నటిస్తున్న మరో భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ “ప్రాజెక్ట్ కే”. ఈ చిత్రబృందం సైతం ప్రభాస్ కు శుభాకాంక్షలు చెబుతూ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. అయితే ఆ మెసేజ్ లోనే ప్రభాస్ పాత్రపై హింట్ ఇచ్చారు. ప్రభాస్ తన ప్రత్యేక రోజున శుభాకాంక్షలు తెలుపుతూ ‘ప్రాజెక్ట్ కే” మేకర్స్ ఆయనను ‘సూపర్ హీరో’ అని పిలిచారు.
Read Also : మరో మైలు రాయిని దాటిన కాజల్ అగర్వాల్
“ప్రాజెక్ట్ కే” సైన్స్ ఫిక్షన్ మూవీ అని ముందుగానే ప్రకటించారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రభాస్‌ను సూపర్ హీరో అని పిలవడం యాదృచ్చికం మాత్రం కాదు అంటున్నారు ఆయన అభిమానులు. ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర ‘సూపర్ హీరో’ అంటూ గత నెలరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘ప్రాజెక్ట్ కే’ బృందం ఆయనను సూపర్ హీరో అంటూ కామెంట్ చేయడంతో అభిమానులు థ్రిల్ అవుతున్నారు. నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ప్రభాస్ సూపర్ హీరోగా కనిపిస్తాడని నెలరోజుల నుంచి వస్తున్న ఊహాగానాలకు ఈ ట్వీట్ ఆజ్యం పోసింది. కాగా బాలీవుడ్ తారలు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే కూడా ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతి మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి మిక్కీ జె మేయర్ సౌండ్‌ట్రాక్‌ను అందిస్తున్నారు. నవంబర్ నుండి ప్రభాస్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు.
