Site icon NTV Telugu

Major Movie: మహారాష్ట్ర సీఎంను కలిసిన ‘మేజర్’ టీమ్

Major Team

Major Team

అడివి శేష్ హీరోగా నటించిన మేజర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. జూన్ 3న విడుదలైన ఈ సినిమా దేశవ్యాప్తంగా అన్ని థియేటర్లలో హౌస్ ఫుల్‌గా రన్ అవుతోంది. 2011లో ముంబైలో జరిగిన పేలుళ్లలో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు తన ప్రాణాన్ని అడ్డుపెట్టిన పోరాట యోధుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్. ఆయన జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మేజర్ సినిమా ఎన్నో అంచనాలతో విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ మూవీని శశికిరణ్ తిక్కా తెరకెక్కించాడు. ఈ నేపథ్యంలో మేజర్ మూవీ టీమ్ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేను మర్యాదపూర్వకంగా కలిసింది. మహారాష్ట్ర సీఎంను కలిసిన వారిలో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్‌గా నటించిన హీరో అడివి శేష్, దర్శకుడు శశి కిరణ్ తిక్కా, నటి సాయి మంజ్రేకర్‌ ఉన్నారు.

కాగా మేజర్ సినిమా సక్సెస్‌ అయినందుకు చిత్రబృందాన్ని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాక్రే అభినందించారు. మేజర్ సినిమా అద్భుతంగా ఉందని.. 26/11 ముంబై దాడులలో దేశం కోసం పోరాడుతూ తన ప్రాణాలను అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం, ఆయన పోరాటాన్ని కళ్లకు కట్టినట్లు చిత్రీకరించినందుకు బృందాన్ని అభినందిస్తున్నట్లు ఆయన తెలిపారు. మేజర్ చిత్ర యూనిట్‌ను అభినందిస్తూ సోషల్ మీడియాలో ట్వీట్ కూడా చేశారు. కాగా మేజర్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు సమాజంలోని అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుకుంటోంది.

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేను కలిసిన విషయాన్ని హీరో అడివి శేష్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ‘మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేని కలిసే అద్భుతమైన అవకాశం వచ్చింది.. వారు ఎన్డీఏలో చేరానుకున్నవారికి సాయం చేయాలనే మా నిర్ణయానికి అన్ని రకాలుగా మద్దతునిస్తానని హామీ ఇచ్చారు. ఇది ఒక అపురూపమైన క్షణం. మా సినిమా గురించి అద్భుతమైన మాటలు చెప్పినందుకు ధన్యవాదాలు సార్’ అంటూ అడివి శేష్ ట్వీట్ చేశాడు.

Exit mobile version