‘సర్కారు వారి పాట’ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోన్న సూపర్ స్టార్ మహేశ్ బాబు.. తన తదుపరి సినిమాల్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో SSMB28 సినిమా చేస్తోన్న మహేశ్, ఆ తర్వాత దర్శకధీరుడు రాజమౌళితో సెట్స్ మీదకి వెళ్లనున్నాడు. ఈ సినిమాకి ఆయన రెండేళ్ల బల్క్ డేట్స్ కూడా ఇచ్చేశాడు. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాదిలో ఈ సినిమా పట్టాలెక్కనుంది. దీని తదనంతరం తన 30వ ప్రాజెక్ట్ కోసం కొరటాల శివతో మహేశ్ చేతులు కలపనున్నట్టు ఆమధ్య వార్తలొచ్చాయి. ఇద్దరి మధ్య కథా చర్చలు కూడా నడిచినట్టు టాక్ వినిపించింది.
స్టోరీ నచ్చడంతో మహేశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, తమతమ ప్రాజెక్టులు ముగించుకున్నాక సెట్స్ మీదకి వెళ్లాలని ఇద్దరు డిసైడ్ అయినట్టు జోరుగా ప్రచారం జరిగింది కూడా! కానీ, ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ దాదాపు అటకెక్కినట్టు వార్తలొస్తున్నాయి. ఇందుకు సరైన కారణాలేంటో తెలియరాలేదు కానీ, కొరటాల పక్కకు తప్పుకున్నట్టు చెప్తున్నారు. దీంతో.. మహేశ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తో చర్చలు జరుపుతున్నాడట! నిజానికి.. వీరి కాంబోలో ‘పుష్ప’ సినిమా తెరకెక్కాల్సింది. కానీ, క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల అది సెట్ కాలేదు. ఫలితంగా అది అల్లు అర్జున్ చేతికి వెళ్లగా, మహేశ్ ఇతర ప్రాజెక్టులతో బిజీ అయిపోయాడు. ఇప్పుడు వీరిద్దరి మధ్య విభేదాలు తొలగిపోయాయని, ఈ నేపథ్యంలోనే కలిసి ఒక ప్రాజెక్ట్ చేయాలని నిర్ణయించుకున్నారని ఇన్ సైడ్ న్యూస్!
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆల్రెడీ మహేశ్, సుకుమార్ మధ్య కథా చర్చలు జరిగిపోయాయట. ఈసారి సుకుమార్ సై-ఫై తరహాలో ఒక విభిన్నమైన స్టోరీ వినిపించాడని, అది నచ్చడంతో మహేశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. తమతమ ప్రాజెక్టులు ముగించుకున్నాక, తమ సినిమాని మొదలుపెట్టాలని ఒప్పందం కూడా చేసుకున్నట్టు వినికిడి. ఒకవేళ ఇదే నిజమైతే, ఒక క్రేజీ ప్రాజెక్ట్ ని మనం విట్నెస్ చేయబోవడం ఖాయం. ఇదివరకే వీరి కాంబోలో ‘1 నేనొక్కడినే’లాంటి ప్రయోగాత్మక చిత్రం వచ్చింది. వసూళ్ళు రాకపోయినా, కాన్సెప్ట్ కి తారాస్థాయిలో ప్రశంసలొచ్చాయి. మరి, ఈసారి వీళ్లు ఎలాంటి సబ్జెక్ట్ తో రాబోతున్నారో చూడాలి.