Site icon NTV Telugu

Rajamouli: ‘జక్కన్న’తో అమిత్ షా మీటింగ్ ఎందుకబ్బా?

Amit Shah Rajamouli Meeting

Amit Shah Rajamouli Meeting

Amit Shah to Meet Rajamouli at His Residence: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలంగాణ మీద ఫోకస్ పెట్టింది బీజేపీ. ఈ క్రమంలోనే ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర మంత్రి అమిత్‌ షా తెలంగాణకు వస్తున్నారు. మహాజన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా వివిధ రంగాల్లో ఉన్న ప్రముఖులను కలుస్తున్నారు, తమ ప్రభుత్వ ఘనతలు చెప్పి తమకు అండగా నిలవాలని కోరుతున్నారు. అందులో భాగంగా ఆయన రాజమౌళితో భేటీ కానుండడం హాట్ టాపిక్ అవుతోంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈరోజు రాత్రి 11.55నిమిషాలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు విమానంలో చేరుకునే అమిత్ షా నోవాటెల్ హోటల్లో బస చేస్తారు.

Also Read: Adipurush Tickets: పీపుల్స్ మీడియా నిర్మాతలకు మెంటలెక్కిస్తున్నారట!

గురువారం ఉదయం 7.30గంటలకు నోవాటెల్ హోటల్లో తెలంగాణ బీజేపీ నేతలతో సమావేశం అయ్యి భేటీ అనంతరం హైదరాబాద్ లో పలువురు ప్రముఖులను అమిత్ షా కలవనున్నారు. గురువారం ఉదయం అంటే రాజమౌళి నివాసానికి వెళ్లి అక్కడ దాదాపు అరగంట పాటు సమయం వెచ్చించనున్నారు. ఇదే ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది, ఎందుకంటే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌కు ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎంపీగా బీజేపీ అవకాశం కల్పించింది. ఆ తరువాత దానికి కృతజ్ఞతగా బీజేపీకి తెలంగాణాలో కలిసి వచ్చేలా రజాకార్ ఫైల్స్ సినిమా చేస్తారని ప్రచారం జరిగింది. ఇక ఈ తరుణంలో రాజమౌళితో అమిత్ షా భేటీ కానుండటం అనేక ఊహాగానాలకు తావిస్తోంది. గతంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన సమయంలో రాజమౌళి, ఎన్టీఆర్, రాంచరణ్‌ను అమిత్ షా ఒకసారి కలిసి ఆస్కార్ అవార్డు వచ్చినందుకు వారికి అభినందనలు తెలియజేశారు.

Also Read: #VD13: పూజా కార్యక్రమాలతో మొదలైన దేవరకొండ-దిల్ రాజు మూవీ

అలాగే అంతకంటే ముందు కూడా ఒకసారి బేగంపేట్‌లోని ఒక హోటల్‌లో జూనియర్ ఎన్టీఆర్‌తో అమిత్ షా ప్రత్యేకంగా సమావేశం కావడం అప్పట్లో కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చకు కారణమైంది. ఇలా హైదరాబాద్ పర్యటనలకు వచ్చిన సమయంలో సినీ ప్రముఖులను అమిత్ షా కలవడం వెనుక పొలిటికల్ మైలేజే లక్ష్యం అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో బీజేపీ సినీ గ్లామర్ తెచ్చేందుకే ఇలా సెలబ్రెటీలతో భేటీ అవుతున్నారు అని, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ పర్యటనకు వచ్చిననప్పుడు హీరో నితిన్‌ ను కూడా అందుకే కలిశారని అంటున్నారు. అయితే బీజేపీ వర్గాలు మాత్రం మహాజన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా అమిత్ షా కలుస్తున్నారని దీనికి రాజకీయ ప్రాముఖ్యత లేదని అంటున్నారు.

Exit mobile version