NTV Telugu Site icon

Mahaan Review : మహాన్ (అమెజాన్ ప్రైమ్)

mahaan

mahaan

చియాన్ విక్రమ్ గత కొంతకాలంగా మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇదే సమయంలో విక్రమ్ తనయుడు ధ్రువ్ తెలుగు ‘అర్జున్ రెడ్డి’తో తమిళనాట హీరోగా ఎంట్రీ ఇచ్చాడు . ఈ తండ్రీ కొడుకుల కాంబినేషన్ లో కార్తీక్ సుబ్బరాజు ‘మహాన్’ పేరుతో సినిమా తీస్తున్నాడనగానే సహజంగానే అందరిలో ఆసక్తి నెలకొంది. థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కొవిడ్ కారణంగా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

‘తప్పు చేయడానికి అనుమతించని స్వాతంత్రం అసలు స్వాతంత్రమే కాదు’ అన్న గాంధీజీ వాక్యాలతో సినిమా ప్రారంభమవుతుంది. స్వాతంత్ర సమరయోధుడి కొడుకు, గాంధీయవాది అయిన మోహన్ దాస్ (‘ఆడుకాలం’ నవీన్) మద్యనిషేధం కోసం ఉద్యమిస్తూ ఉంటాడు. తన కొడుకు గాంధీ మహాత్ముడు అంతటి వాడు కావాలని అతనికి గాంధీ మహాన్ (విక్రమ్) అనే పేరు పెడతాడు. అయితే చిన్నప్పుడు కాస్తంత గాడి తప్పిన గాంధీని గట్టిగా మందలించి, తిరిగి దారిలోకి తెస్తాడు. ఉపాధ్యాయుడిగా స్థిరపడిన గాంధీకి భార్య ఝాన్సీ (సిమ్రాన్), కొడుకు దాదా (ధ్రువ్) ఉంటారు. అత్యంత సాదాసీదాగా జీవితం గడిచిపోతోందని బాధపడుతున్న గాంధీ జీవితం అతని 40వ పుట్టిన రోజున ఊహించని మలుపు తిరుగుతుంది. భార్య, పిల్లాడు ఆ రోజు వేరే ఊరు వెళ్ళడంతో అతను మందు తాగాలనే చిరకాల కోరికను తీర్చుకోవడానికి బార్ కు వెళతాడు. అది తన చిన్ననాటి స్నేహితుడు సత్య (బాబీ సింహా)ది అని తెలుస్తుంది. ఆ రాత్రి సత్యతో ఉండి, తెల్లవారు ఝామున ఇంటికి వెళతాడు. భర్త తాగి వచ్చాడని తెలిసి ఝాన్సీ అతన్ని వదిలేసి, కొడుకును తీసుకుని ఇల్లు వదిలి పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఇక స్నేహితుడి సాయంతో గాంధీ ఎలా లిక్కర్ సిండికేట్ అధినేతగా ఎదిగాడు? సత్య, గాంధీలతో పాటు రాజకీయ నాయకుడైన మరో బాల్య మిత్రుడు జ్ఞానోదయం చేతులు కలపడంతో వీరు రాష్ట్రంలో మద్యం సిండికేట్ ను ఎలా హస్తగతం చేసుకున్నారు? వీరికి పోలీస్ ఆఫీసర్ అయిన గాంధీ కొడుకు బాబా ఎలా చెక్ పెట్టాడు? అనేది మిగతా కథ.

సాధారణ స్కూల్ టీచర్ అయిన గాంధీ లిక్కర్ సిండికేట్ అధినేతగా ఎదగడం మీద సినిమా ప్రథమార్ధం సాగుతుంది. ఇదేమంత ఆసక్తికరంగా ఉండదు. మధ్యలో సత్య వెనుకడుగు వేయడం, అతన్ని తిరిగి గాంధీ దారిలోకి తీసుకు రావడం, సత్య కొడుకు రాకీని గాంధీ సొంతకొడుకుగా భావించడం… ఇవన్నీ సాదాసీదాగా సాగిపోయే సన్నివేశాలు. అయితే ఈ లిక్కర్ సిండికేట్ ఆగడాలను అరికట్టడానికి గాంధీ కొడుకు దాదా రంగంలోకి దిగిన తర్వాత కథ కాస్తంత ఊపందుకుంది. క్లయిమాక్స్ లో ఎత్తులు పైఎత్తులతో కాస్తంత ఆసక్తికరంగా సినిమా ముగిసింది. నిజానికి ఈ కథలో మనకి కొత్తదనం ఏమీ కనిపించదు. ఎన్నో సినిమాల్లో చూసిన పలు సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. నిజ జీవితంలో తండ్రీ కొడుకులైన విక్రమ్, ధ్రువ్ ఒకరిని ఒకరు ఢీ కొట్టే పాత్రలు చేయడం అనేది మాత్రమే వీక్షకులను కట్టిపడేసే అంశం.

విక్రమ్ కు ఈ తరహా పాత్రలు చేయడం కొట్టిన పిండి. ఓ సామాన్యమైన వ్యక్తి సాధారణమైన గ్యాంగ్ స్టర్ గా మారడం అనేది ఆసక్తిని కలిగించేదే. అయితే కథగా కంటే… తన నటనతో విక్రమ్ అందరినీ మెప్పించాడు. ఇక జాతీయస్థాయిలో అవార్డును అందుకున్న బాబీ సింహా మరోసారి తనదైన ప్రతిభను ఈ చిత్రంలో కనబరిచాడు. విక్రమ్ భార్యగా సిమ్రాన్ తెర మీద ఫస్ట్ హాఫ్ లో బాగానే ఉంది. కానీ ద్వితీయార్థంకు వచ్చే సరికీ ఆ పాత్రకు అంత ప్రాధాన్యం లేకుండా పోయింది. డ్రామాను రక్తికట్టించడం కోసం ఆమె పాత్రను ఉపయోగించుకున్నారు. సినిమాకు చాలా కీలకమైన భర్తను వదిలి వెళ్ళిపోయే సన్నివేశం చాలా పేలవంగా ఉంది. విక్రమ్ తనయుడు ధ్రువ్ నటించింది ఒక్క సినిమానే అయినా అతని బాడీ లాంగ్వేజ్ బాగుంది, నటనలో ఈజ్ ఉంది. తండ్రితో తలపడిన సన్నివేశాలను సైతం చాలా కాన్ఫిడెన్స్ తో చేశాడు. రాకీ పాత్రలో సనంత్ చక్కగా నటించాడు. రాజకీయ నేత జ్ఞానోదయం గా వేట్టై ముత్తు కుమార్ చక్కటి నటన కనబరిచాడు.

‘మహాన్’ చిత్రం సాంకేతికంగా ఇంకాస్తంత మెరుగ్గా ఉండాల్సింది. సంతోష్‌ నారాయణ్ నేపథ్య సంగీతం బాగుంది కానీ పాటలు ఏమంత ఆకట్టుకునేలా లేవు. అది సినిమాకు మెయిన్ మైనెస్ పాయింట్. శ్రేయస్‌ కృష్ణ ఫోటోగ్రఫీ ఓకేనే. ఇక ఓటీటీలో ఇంత పెద్ద సినిమా చూడటం అంటే వీక్షకుల సహనాన్ని పరీక్షించడమే. మూవీ రన్ టైమ్ ను తగ్గించి ఉంటే బాగుండేది. పైకి ఇది ఓ గ్యాంగ్ స్టర్ కథే అనిపించినా, కార్తీక్ సుబ్బరాజు తాను చెప్పాలనుకున్న సందేశాన్ని చక్కగా కన్వే చేశాడు. గాంధీ పేరు చెప్పుకుంటూ అరాచకాలకు పాల్పడటం, తాము నమ్మిన సిద్ధాంతాలను బలవంతంగా ఎదుటి వారిపై రుద్దటం తప్పు అని తెలిపాడు. సమాజానికి హాని చేసే వారి లానే ఇలాంటి వారి వల్ల కూడా ఉపయోగం లేదని, ఏదైనా మితంగా ఉంటేనే మంచిదని తనదైన శైలిలో చెప్పాడు. అది ఎంతమందిని చేరుతుందో చూడాలి. భారీ అంచనాలతో ఈ ‘మహాన్’ను చూస్తే మాత్రం నిరాశ తప్పదు. అయితే విక్రమ్, బాబీ సింహా నటన వీక్షకులకు కాస్తంత ఊరట అని చెప్పొచ్చు.

రేటింగ్: 2.75 / 5

ప్లస్ పాయింట్స్
విక్రమ్ – ధ్రువ్ కాంబో
నటీనటుల నటన
ఎంచుకున్న కథ

మైనెస్ పాయింట్స్
ఆసక్తి కలిగించని ప్రథమార్థం
సినిమా నిడివి

ట్యాగ్ లైన్: విక్రమ్ వర్సెస్ ధ్రువ్!