Site icon NTV Telugu

Madhubala: ఛాన్స్ ఇస్తే నెగెటివ్ రోల్స్ కూ సై!

Madhubala

Madhubala

Madhubala: నిఖిల్ నటించిన ‘సూర్య వర్సెస్ సూర్య’తో టాలీవుడ్ లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు నటి మధుబాల. ఇటీవల ‘గేమ్ ఆన్’ అనే సినిమాలోనూ ఆమె కీలక పాత్ర పోషించారు. ఇక డిసెంబర్ 2న రాబోతున్న త్రిగుణ్‌, మేఘా ఆకాశ్‌ మూవీ ‘ప్రేమదేశం’లోనూ మధుబాల కీ-రోల్ ప్లే చేశారు. ఈ సినిమా విడుదల సందర్భంగా ఇందులోని తన పాత్ర గురించి, ప్రస్తుతం నటిస్తున్న సినిమాల గురించి ఆమె ఇలా షేర్ చేసుకున్నారు. ”నేను గతంలో హీరోయిన్ గా నటించాను. అయితే ఇప్పుడు అలాంటి పాత్రలు చేయలేను కాబట్టి తల్లి పాత్రలు చేస్తున్నాను. ‘ప్రేమదేశం’లోని ఈ పాత్రను నా కోసమే రాశానని దర్శకుడు అన్నారు. నేను ముందు నో చెప్పాను. కానీ పలు మార్లు కలిసి ఒత్తిడి చేయడంతో అంగీకరించాను. అయితే ఈ మూవీ చేస్తున్న సమయంలో ఇది ఎంత మంచి పాత్రో అర్థమైంది. నిజానికి ఇందులో నేను ఒక హీరోయిన్ లాంటి పాత్రలోనే కనిపిస్తాను. తల్లీకొడుకుల రిలేషన్ చాలా చక్కగా చూపించారు. త్రిగుణ్ చాలా సహజంగా నటించాడు. అతని నటన చూసిన తర్వాత నాకూ కాన్ఫిడెన్స్ పెరిగింది. అలానే ఈ టైటిల్, మ్యూజిక్ కూడా నాకెంతో నచ్చాయి” అని అన్నారు. సినీరంగంలోని తన అనుభవాలను చెబుతూ, ”ఇండస్ట్రీలో ఎప్పుడూ పోటీతత్వం ఉంటుంది. హీరోయిన్‌గా చేసినప్పుడు అంతే, ఇప్పుడూ అంతే. కానీ దాన్ని నేను కాంపిటీషన్‌లా ఎప్పుడూ చూడను. మనకు ఏ పాత్ర రాసి ఉంటే.. అవే వస్తాయని భావిస్తాను. తమిళ్‌లో ‘స్వీట్ కార్న్ కాఫీ’ అనే వెబ్ సిరీస్‌లో నేను ఫుల్ కామెడీ రోల్ చేశాను. నేను మామూలుగానే సరదాగా ఉంటాను. ఆ వెబ్ సిరీస్ చూశాక.. అందరూ నా కామెడీ టైమింగ్ బాగుందని అభినందించారు. నాకు సినిమాల్లోనూ కామెడీ రోల్ చేయాలని ఉంది” అని చెప్పారు.

‘తెలుగు, హిందీ భాషలు చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుందని, తమిళ్, మిగతా భాషలు కాస్తంత డిఫరెంట్ గా ఉంటాయని, తెలుగు భాష పూర్తిగా రాకపోయినా, దర్శకులతో చర్చించే ఆస్కారం ఎక్కువ ఉంటుందని, ఇప్పుడు తెలుగులో పని చేస్తేనే రీచ్ ఎక్కువ కాబట్టి, ఇకపై తాను తెలుగు సినిమాల మీదనే ఫోకస్ పెడతాన’ని మధుబాల తెలిపారు. ‘ప్రస్తుతం తనను ఎవరూ ముంబై అమ్మాయిగా ట్రీట్ చేయడం లేదని, తాను కూడా ఏ భాషలో సినిమా చేస్తే ఆ భాషకు చెందిన అమ్మాయిగా కనిపించేందుకు ప్రయత్నిస్తాన’ని అన్నారు. తాను ఎక్కువ నార్త్ ఇండియాలనూ, ఎక్కువ సౌత్ ఇండియన్ లానూ కనిపించనని, అదే తనలో ప్లస్ పాయింట్ అని మధుబాల తెలిపారు. ఛాన్స్ ఇవ్వాలే కానీ కామెడీ రోల్ తో పాటు నెగెటివ్ రోల్ సైతం చేయడానికి తాను సిద్ధమని చెప్పారు. ప్రస్తుతం హిందీలో మూడు సినిమాలతో పాటు జీ 5 కోసం ఓ వెబ్ సీరిస్ లో నటిస్తున్నట్టు మధుబాల తెలిపారు.

Exit mobile version