మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఎప్పుడూ కొత్తదనం కోసం పరితపిస్తుంటాడు. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా కోసం అహర్నిశలు స్క్రీప్ట్ ల వేటలో ఉన్నాడు. కొన్ని సినిమాలు స్క్రిప్ట్ దశలో ఉండగానే వాటి రైట్స్ తీసుకుని ఆహాలో స్ట్రీమింగ్ చేసేలా కూడా ప్లాన్ చేస్తున్నాడు. అలా ‘లాక్డ్, కుడి ఎడమైతే’ వంటి సినిమాలు ఉన్నాయి. తాజాగా అలా ‘టైమ్ లూప్’ కాన్సెప్ట్ తో తెరకెక్కిన శింబు ‘మానాడు’ సినిమా రీమేక్ రైట్స్ ను అరవింద్ తీసుకున్నారట. వెంకట్ ప్రభు దర్శకత్వంలో శింబు ప్రధాన పాత్రలో నటించిన ఈ తమిళ చిత్రం 2014లో వచ్చిన హాలీవుడ్ మూవీ ‘ఎడ్జ్ ఆఫ్ టుమారో’కు ప్రేరణ. గత నెల 25న విడుదలైన ఈ తమిళ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయి వసూళ్ళను సాధిస్తోంది.
దీని రీమేక్ హక్కుల కోసం పలువురు పోటీ పడినప్పటికీ అల్లు అరవింద్ దక్కించుకున్నట్లు వినికిడి. ముఖ్యమంత్రిని హత్య చేయటానికి పన్నిన కుట్రను ఛేదించాల్సిన హీరో మరణిస్తాడు. కానీ అతడే ఆ కుట్రను భగ్నం చేసి కాపాడతాడు. అది ఎలా అన్నదే ఈ టైమ్ లూప్ మూవీ. ఈ రీమేక్ లో సాయిధరమ్ తేజ్ కానీ అల్లు శిరీష్ కానీ నటిస్తారని వినవస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడుతుందంటున్నారు.