M.S Raju: ఇప్పుడైతే యమ్.యస్.రాజు అంటే ఓ నాటి నిర్మాత అని కొందరు భావించవచ్చు. కానీ, రెండు దశాబ్దాల క్రితం యమ్మెస్ రాజు సినిమా వస్తోందంటే, అగ్ర కథానాయకులు సైతం తమ చిత్రాన్ని విడుదల చేయాలా వద్దా అని ఆలోచించేవారు. అంతలా ఓ వెలుగు వెలిగిన యమ్మెస్ రాజు కాసింత నెమ్మదించారే కానీ, చిత్రసీమకు దూరంగా జరగలేదు. ప్రస్తుతం యమ్మెస్ రాజు దర్శకత్వంలో రూపొందిన ‘మళ్ళీ పెళ్ళి’ చిత్రం చర్చనీయాంశమయింది. అందులో సీనియర్ యాక్టర్ నరేశ్, నటి పవిత్రా లోకేశ్ నటించడంతోనే ఈ చర్చ సాగుతోంది. అదలా ఉంచితే, ఇరవై ఏళ్ళ క్రితం యమ్మెస్ రాజును అందరూ ‘పొంగల్ రాజు’ అంటూ కీర్తించేవారు. ఆయన నిర్మించిన “ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా” చిత్రాలు వరుసగా 2003, 2004, 2005 సంవత్సరాల్లో సంక్రాంతికి విడుదలై విజయవిహారం చేశాయి. ఈ చిత్రాలలో నటించిన మహేశ్, ప్రభాస్, సిద్ధార్థ్ మరపురాని ఘన విజయాలను అందుకోవడం గమనార్హం!
యమ్మెస్ రాజు తండ్రి రాయపరాజు సైతం నిర్మాతగా చిత్రసీమలో సాగారు. ఆయన నిర్మించిన చిత్రాలు ఆట్టే అలరించక పోయాయి. తండ్రిని మించిన తనయునిగా యమ్మెస్ రాజు సక్సెస్ రూటులో సాగారు. వెంకటేశ్ తో నిర్మించిన ‘శత్రువు’తో నిర్మాతగా యమ్మెస్ రాజుకు ఓ గుర్తింపు లభించింది. ఆ చిత్రదర్శకుడు కోడి రామకృష్ణతో రాజు అనుబంధం విడదీయరానిది. కోడి దర్శకత్వంలోనే రాజు నిర్మించిన ‘దేవి’ చిత్రం కూడా ఘనవిజయం సాధించింది. ఈ సినిమాతోనే దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకునిగా పరిచయం కావడం విశేషం! ఇక ‘చిత్రం, నువ్వు-నేను’ చిత్రాలతో సక్సెస్ రూటులో సాగుతున్న ఉదయ్ కిరణ్ కు వాటిని మించిన హిట్ ను తన ‘మనసంతా నువ్వే’తో అందించారు రాజు. అప్పటి దాకా ఓ మోస్తరు హిట్స్ తో సాగుతున్న మహేశ్ బాబుకు తన ‘ఒక్కడు’తో తొలి ఘనవిజయాన్ని కట్టబెట్టారు. అలాగే సక్సెస్ కోసం పరితపిస్తున్న ప్రభాస్ కు ‘వర్షం’తో మొదటి సూపర్ హిట్ ను అందించిందీ యమ్మెస్ రాజునే! ఇక తమిళంలో రాణిస్తున్న సిద్ధార్థ్ ను తమ ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’తో తెలుగువారికి పరిచయం చేసిందీ ఆయనే! ఈ సినిమా సైతం హిట్ గా నిలచింది.
రాజు కెరీర్ లో భారీ విజయాలు ఉన్నాయి; అలాగే పరాజయాలూ చోటు చేసుకున్నాయి. యమ్మెస్ రాజు సినిమాలను పరిశీలిస్తే వాటిలో ఆయన అభిరుచి కనిపిస్తుంది. కథకు తగ్గట్టుగా ఖర్చు చేసేవారాయన. అలాంటి రాజుకు సిద్ధార్థ్, ఇలియానాతో నిర్మించిన ‘ఆట’ పరవాలేదనిపించింది. ఆ తరువాత నుంచీ పరాజయాలే పలకరించసాగాయి. ‘వాన’ చిత్రంతో మెగాఫోన్ పట్టి డైరెక్టర్ అయిన రాజుకు ఆ సినిమా సైతం నిరాశ మిగిల్చింది. తనయుడు సుమంత్ అశ్విన్ ను హీరోగా పరిచయం చేస్తూ ‘తూనీగ తూనీగ’ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు రాజు. ఆ పై ‘డర్టీ హరీ, 7 డేస్ 6 నైట్స్’ తీసినా రాజుకు ఆశించిన సక్సెస్ దరి చేరలేదు. ఇప్పుడు ముదురు జంట నరేశ్, పవిత్రతో రాజు దర్శకత్వంలో రూపొందిన ‘మళ్ళీ పెళ్ళి’ అయినా ఆయనకు ఊరట కలిగిస్తుందేమో చూడాలి.