ఓ విభిన్నమైన కథ కథనాలతో సహజత్వానికి దగ్గరగా రాబోతున్న సరికొత్త చిత్రం ‘@లవ్’. రామరాజు, సోనాక్షి వర్మ, అభి, ప్రీతి సింగ్, శ్రీకృష్ణ, డాక్టర్ మారుతి సకారం తదితరులు ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా టైటిల్ లోగోను ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ లాంచ్ చేశారు. ‘గిరిజన నేపథ్యంలో స్వచ్ఛమైన ప్రేమ కథతో రాబోతున్న ఈ సినిమా, ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలని, అందులో భాగంగానే, తాను ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తున్నాన’ని నాగ్ అశ్విన్ చెప్పారు. వాస్తవానికి దగ్గరగా ఉండే ఈ కథ, ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుందని చిత్ర నిర్మాతలు చెబుతున్నారు. టి.ఎం.ఎస్. బ్యానర్ లో ప్రీతమ్ ఆర్ట్స్, యస్. ఎన్. క్రియేషన్స్ కలయికతో మహేందర్ సింగ్, శైలజ తాటిచెర్ల, శ్రీనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మనసుకు హత్తుకునే ఎమోషన్స్ తోపాటు ఆడజాతికి సంబంధించిన ఓ గొప్ప సందేశం కూడా అంతర్లీనంగా ఇందులో ఉంటుందని దర్శకుడు శ్రీనారాయణ చెప్పారు. ఈ సినిమా షూటింగ్ మొత్తం అటవీ ప్రాంతంలో జరగడం విశేషం.