కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో జూలై 23 నుండి సినిమాలు విడుదల కావడం మొదలైంది. ఆ శుక్రవారం ‘నేరగాడు’ అనే తమిళ డబ్బింగ్ మూవీ విడుదలైతే, జూలై 30న ‘తిమ్మరుసు’లో కలిపి ఐదు చిత్రాలు విడుదలయ్యాయి. అయితే ‘తిమ్మరుసు’ మూవీ మాత్రమే ఫర్వాలేదనిపించింది. ఇక ఆగస్ట్ ఫస్ట్ వీకెండ్ లో డబ్బింగ్ తో కలిసి ఏడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. విశేషం ఏమంటే… ఇందులో ‘ఎస్. ఆర్. కళ్యాణ మండపం’ సూపర్ హిట్ అయిపోయింది. దాంతో చిన్న చిత్రాల నిర్మాతలలో కొత్త జోష్ నెలకొంది. సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో భారీ బడ్జెట్ చిత్రాలు వస్తాయనే భావనతో ఇప్పుడు చిన్న చిత్రాల నిర్మాతలు ఇదే తమకు అనుకూలమైన సమయంగా భావిస్తున్నారు. ‘ఎస్. ఆర్. కళ్యాణ్ మండపం’కు వచ్చిన క్రేజ్ తో ఆగస్ట్ సెకండ్ వీకెండ్ లో ఏకంగా పది చిత్రాలు విడుదల కాబోతున్నాయి.
ఇందులో శుక్రవారం ‘సుందరి, బ్రాందీ డైరీస్, సలామ్ నమస్తే, చైతన్యం, కనబడుట లేదు’ వంటి స్ట్రయిట్ చిత్రాలతో పాటు తమిళ డబ్బింగ్ సినిమా ‘ఒరేయ్ బామ్మర్ది’, ఆంగ్ల అనువాద చిత్రం ‘ది కంజురింగ్’ వస్తున్నాయి. శనివారం 14వ తేదీ ఆర్. నారాయణ మూర్తి ‘రైతన్న’తో పాటు విశ్వక్ సేన్ ‘పాగల్’ భారీ అంచనాలతో విడుదల కాబోతున్నాయి. మరి స్వాతంత్ర దినోత్సవ కానుకగా రాబోతున్న ఈ పది చిత్రాల జాతకం ఏమిటనేది తెలియాలంటే ఈ వీకెండ్ వరకూ వేచి ఉండాల్సిందే!