Santosh Shobhan: దర్శకుడు, స్వర్గీయ శోభన్ తనయులిద్దరూ ఇవాళ తెలుగు సినిమా రంగంలో నటులుగా రాణిస్తున్నారు. పెద్దవాడైన సంతోష్ శోభన్ పలు చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తుంటే, చిన్నవాడు సంగీత్ శోభన్ సినిమాలు, వెబ్ సీరిస్ లలో నటిస్తూ తన కంటూ ఓ గుర్తింపు తెచ్చుకునే క్రమంలో ఉన్నాడు. సంతోష్ శోభన్ నటించిన తాజా చిత్రం ‘లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్’ మూవీ ఇటీవల విడుదలైంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోకపోయినా, సంతోష్ శోభన్ కు నటుడిగా గుర్తింపునైతే తెచ్చిపెట్టింది.
ఈ సందర్భంగా సంతోష్ సోషల్ మీడియా ద్వారా ఎమోషనల్ పోస్ట్ ఒకటి పెట్టారు. అందులో ఆయన స్పందిస్తూ, ”నేను 2010లో తొలిసారి కెమెరా ముందుకొచ్చాను. నా ఫేవరేట్ డైరెక్టర్ ఇంద్రగంటి దర్శకత్వంలో ‘గోల్కొండ హైస్కూల్’ చిత్రంలో నటించాను. ఆ సినిమాలో నా డైలాగ్స్ చెప్పినప్పుడు ఉద్వేగానికి లోనయ్యాను. నేను నా కలను సాకారం చేసుకున్న అనుభూతి కలిగింది. ఇక అప్పటి నుంచి నేను ఎప్పుడు కెమెరా ముందుకొచ్చినా నా డ్రీమ్ ను ఫుల్ ఫిల్ చేసుకుంటున్నానని ఆనందపడుతుంటాను. ఇదే ఆనందాన్ని నిత్యం పొందేందుకు మంచి కథల్లో నటిస్తూ, మిమ్మల్ని ఎంటర్ టైన్ చేయాలనుకుంటున్నాను. నా లేటెస్ట్ మూవీ ‘లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్’ కు మీరు చూపించిన ఆదరణ, మా వెంట మీరున్నారనే ధైర్యాన్నిచ్చింది. నా సోదరుడు, దర్శకుడు మేర్లపాక గాంధీ, నాయిక ఫరియా అబ్దుల్లా ఇతర కాస్ట్ అండ్ క్రూ అందరికీ నా కృతజ్ఞతలు చెబుతున్నాను” అని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే… సంతోష్ శోభన్ నటించిన ‘ప్రేమ్ కుమార్’, ‘శ్రీదేవి శోభన్ బాబు’, ‘అన్ని మంచి శకునములే’ చిత్రాలు విడుదలకు సిద్థంగా ఉండగా, యూవీ క్రియేషన్స్ లో రెండు ప్రాజెక్ట్స్ లకు ప్లానింగ్ జరుగుతోంది.