Site icon NTV Telugu

Arjun Reddy Becomes Liger: ఐదేళ్ళు… అర్జున్ రెడ్డి… లైగర్ అయ్యాడు!

Arjun Reddy To Liger

Arjun Reddy To Liger

Liger Releasing On Arjun Reddy Date After Five Years: హీరోగా విజయ్ దేవరకొండకు స్టార్ డమ్ సంపాదించి పెట్టిన చిత్రం ‘అర్జున్ రెడ్డి’. ఈ ఒక్క సినిమాతోనే దర్శకునిగా తనదైన బాణీ పలికించారు సందీప్ రెడ్డి వంగా. ‘అర్జున్ రెడ్డి’ చిత్రం 2017 ఆగస్టు 25న జనం ముందు నిలచింది. యువతను విశేషంగా ఆకట్టుకుంది. అంటే ఈ చిత్రం విడుదలై ఐదేళ్ళయిందన్న మాట! ఈ ఐదేళ్ళలో ‘గీత గోవిందం’తో విజయ్ కి మరో బంపర్ హిట్ లభించింది. ఆ తరువాత నుంచీ ఆ స్థాయి హిట్ విజయ్ కిట్ లో పడలేదు. సందీప్ రెడ్డి ఇదే ‘అర్జున్ రెడ్డి’ని హిందీలో ‘కబీర్ సింగ్’గా తెరకెక్కించి, బాలీవుడ్ లోనూ జయకేతనం ఎగురవేశాడు. ఇప్పుడు తన వంతు అంటూ విజయ్ దేవరకొండ ‘లైగర్’ చిత్రంతో బాలీవుడ్ బాట పట్టాడు. చిత్రంగా ‘అర్జున్ రెడ్డి’ విడుదలైన ఆగస్టు 25వ తేదీనే ‘లైగర్’ను రిలీజ్ చేస్తున్నారు. ఈ ఐదేళ్ళలో విజయ్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. సందీప్ రెడ్డికి ఉత్తరాదిన కూడా మార్కెట్ దొరికింది. దాంతో మాతృభాష తెలుగును వదలి హిందీలోనే రణబీర్ కపూర్ తో ‘ఆనిమల్’ అనే చిత్రం తెరకెక్కిస్తున్నాడు.

‘అర్జున్ రెడ్డి’లో విజయ్ కి కొత్త దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దొరికాడు. ఇప్పుడు ‘లైగర్’ కు స్పీడున్న పూరి జగన్నాథ్ దర్శకుడు. చకచకా నెలల్లోనే సినిమాలు పూర్తి చేసే పూరి జగన్నాథ్ సైతం ‘లైగర్’ విషయంలో ఆలస్యం చేశాడు. ‘అర్జున్ రెడ్డి’ని మరిపిస్తుంది ‘లైగర్’ అంటూ విజయ్ దేవరకొండ స్టేట్ మెంట్ ఇచ్చేశాడు. తనకెంతో పేరు సంపాదించి పెట్టిన ‘అర్జున్ రెడ్డి’నే విజయ్ అలా అనడం కొందరికి నచ్చడం లేదు. పైగా ‘లైగర్’ ప్రెస్ మీట్ లో విజయ్ కాళ్ళు పైన పెట్టుకొని మాట్లాడటమూ ఇప్పుడు ట్రోలింగ్ లో ప్రత్యేక స్థానమే ఆక్రమించింది. ‘అర్జున్ రెడ్డి’ విడుదల సమయంలో అమ్మాయి, అబ్బాయి ముద్దు పెట్టుకోబోయే పోస్టర్ చూసి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు కామెంట్ చేయడం, దానికి ‘కూల్…కాకా…కూల్…’ అని విజయ్, సందీప్ కామెంట్స్ చేయడం, ఆ తరువాత దానిపై చర్చోపచర్చలు సాగడం ‘అర్జున్ రెడ్డి’ విజయానికి పరోక్షంగా పనిచేశాయి. మరి ఇప్పుడు ‘లైగర్’ విషయంలో ట్రోల్ అవుతున్న అంశాల్లో విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ గురించి చెబుతున్నారు. అలాగే నార్త్ లో ‘లైగర్’ హిందీ వర్షన్ ను ‘#బాయ్ కాట్’ అంటున్నారు జనం. అక్కడ విజయ్ కి ఎవరూ వ్యతిరేకం కాకపోవచ్చు కానీ, ఈ ‘బాయ్ కాట్’ బాబులు ‘నెపోటిజమ్’ పేరుతో హీరోయిన్ అనన్య పాండేను, అక్కడి నిర్మాణ భాగస్వామి కరణ్ జోహార్ ను టార్గెట్ చేశారు. మరి ఈ బాయ్ కాట్ హంగామా ‘లైగర్’కు మేలు చేస్తుందా లేదా అన్న ఆసక్తి తెలుగువారిలో ఉంది.

‘లైగర్’ కథ చూస్తే గతంలో పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి’ లాగే ఉంటుందని అంటున్నారు. అయినా ఈ తరం మెచ్చేలా ‘లైగర్’ ఉంటే జనం ఆదరించకుండా ఉంటారా? ‘అర్జున్ రెడ్డి’ని గమనించండి. ఆ కథను లోతుగా చూస్తే ‘దేవదాసు’ కథలా ఉంటుంది. అయితే చివరకు ‘దేవ్-డి’లో లాగా హీరో, తనను ప్రేమించే చంద్రతో జీవితం కొనసాగించడానికి పూనుకోవడంతో కథ సుఖాంతమవుతుంది. ‘అర్జున్ రెడ్డి’లో తన కాలేజ్ లోనే జూనియర్ ను లవ్ చేయడం, మాటామాటా పెరిగి విడిపోవడం, హీరోయిన్ వేరే వాడిని పెళ్ళాడడం, ఆమె వాడిని వదిలేసి, అర్జున్ రెడ్డి వల్ల కలిగిన గర్భాన్ని భరిస్తూ ఉండడం, హీరో దేవదాసులాగే తాగుడుకు బానిసై చివరకు కుక్కపిల్లను కూడా తోడు పెట్టుకోవడం కనిపిస్తుంది. ‘దేవదాసు’లో కన్నతండ్రి చనిపోయినా, హీరోలో మార్పురాదు. కానీ, ‘అర్జున్ రెడ్డి’లో నాన్నమ్మ మరణంతో హీరో మారిపోతాడు. లక్కీగా అతను ప్రేమించిన అమ్మాయి గర్భిణిగా కనిపిస్తుంది. ఆమె కడుపులో ఉన్నది తన ప్రతిరూపం అని తెలియడం, ఆమె పెళ్ళాడిన వాడితో కాపురం చేయలేదని తెలుసుకోవడం అన్నీ జరిగి చివరకు ప్రేమించిన అమ్మాయిని పెళ్ళాడి ఇంటికి తీసుకువెళ్ళడంతో కథ సుఖాంతమవుతుంది.

మరి పాత కథనే అయినా తీసే పద్ధతిలో వైవిధ్యం ఉంటే ఈ తరం జనం తెలుసుకోలేరు. కాబట్టి ‘అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి’ పోకడలు ‘లైగర్’ లో కనిపించినా నో ప్రాబ్లమ్ అంటున్నారు కొందరు. మరి ‘అర్జున్ రెడ్డి’ డేట్ కే రిలీజ్ అవుతున్న ‘లైగర్’ ఏ స్థాయిలో అలరిస్తాడో చూడాలి.

Exit mobile version